అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sampre Nutritions Ltd | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ఏడాది కాలంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. కానీ ఓ స్టాక్ మాత్రం జూన్ 11వ తేదీనుంచి పైపైకి వెళ్తూనే ఉంది. తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సెన్సెక్స్(Sensex) ఈ రెండున్నర నెలల కాలంలో 2.2 శాతం, నిఫ్టీ 1.6 శాతం వరకు నెగెటివ్ రిటర్న్స్ ఇవ్వగా.. ఆ స్టాక్ మాత్రం ఏకంగా 275 శాతం పెరగడం గమనార్హం. ఆ స్టాక్ గురించి తెలుసుకుందామా..
సంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్(Sampre Nutritions Ltd) కంపెనీ న్యూట్రాష్యూటికల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఆయా ప్రొడక్ట్స్ కోసం ఇటీవల టోలరామ్ వెల్‌నెస్ లిమిటెడ్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో వార్షిక ప్రాతిపదికన రూ. 10 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మూడేళ్ల వ్యవధిలో రూ. 30 కోట్ల వరకు వ్యాపారం ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కంపెనీ షేరు విలువ పెరగడం ప్రారంభించింది. ఇది పెన్నీ స్టాక్ కావడం, భారీ ఆర్డర్ ఉండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి కొంటున్నారు. దీంతో రోజూ అప్పర్ సర్క్యూట్ కొడుతూ పైపైకి వెళ్తోంది.
జూన్ 11నుంచి..
ఈ ఏడాది జూన్ 11న సంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్‌లో అప్‌ట్రెండ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ఒక్క సెషన్‌లో కూడా ఈ స్టాక్ నష్టాన్ని చూడలేదు. జూన్ 11న ఈ షేరు ధర రూ. 23.06 ఉండగా.. సెప్టెంబర్ 5న రూ. 86.67 వద్ద స్థిరపడిరది. జూన్ 11న ఈ కంపెనీ షేర్లలో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినవారి సంపద ఇప్పుడు రూ. 3.75 లక్షలు అయ్యిందన్న మాట.
పతనమూ ఇదే స్థాయిలో..
ఈ కంపెనీ షేర్లు రెండున్నర నెలలుగా ఏ విధంగానైతే పెరుగుతున్నాయో.. గతంలో పతనమూ అదే స్థాయిలో జరిగింది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన ఒక్కో ఈక్విటీ షేరు(Share) ధర రూ. 80 ఉండగా.. నవంబర్ 8న రూ. 101.17 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఆ తర్వాత ఈ స్టాక్‌లో పతనం ప్రారంభమైంది. మార్చి 27న రూ. 20.90 కు పడిపోయి 52 వారాల కనిష్టాన్ని(52 weeks low) నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.