అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad Police | నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలో పలు పోలీస్ స్టేషన్లు అప్‌గ్రేడ్ కాబోతున్నాయి. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్వోలుగా (స్టేషన్ హౌస్ ఆఫీసర్) వ్యవహరిస్తున్న పలు స్టేషన్లు.. ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్వోలుగా (SHO) వ్యవహరించే స్థాయికి అప్‌గ్రేడ్ కానున్నాయి. ఇప్పటికే కమిషనరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. దీనికి ప్రభుత్వం అతి త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌గా మారినప్పటికీ స్టేషన్ల అప్‌గ్రేడ్ మాత్రం జరగలేదు. శాంతి భద్రతల పర్యవేక్షణ, పరిపాలన సౌలభ్యంలో భాగంగా కమిషనరేట్ పరిధిలో ఉన్న స్టేషన్లకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎస్‌హెచ్‌వోలు ఉంటారు. 2016లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఠాణాను కూడా అప్‌గ్రేడ్ చేయలేదు. వాస్తవానికి పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు పంపిన ప్రతిపాదనలు ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు, తాజాగా కానిస్టేబుల్ హత్య ఉదంతం ఘటన నేపథ్యంలో స్టేషన్ల అప్‌గ్రేడ్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Nizamabad Police | ఓకే చెప్పిన డీజీపీ
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy), ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) కుటుంబాన్ని వారు పరామర్శించారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో పలు కీలక విషయాలపై ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి చర్చించారు. ఇదే సమయంలో స్టేషన్ల అప్‌గ్రేడ్ పెండింగ్ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రతిపాదనలు పంపిన మేరకు స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఓకే చెప్పారని తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
Nizamabad Police | అప్‌గ్రేడ్ అయ్యే స్టేషన్లు ఇవే..
జిల్లాలో ఎస్హెచ్వోలుగా అప్‌గ్రేడ్ అయ్యే స్టేషన్లలో నగరంలోని నాలుగో టౌన్ ఠాణా మొదటి వరుసలో ఉంది. ఈ స్టేషన్ పరిధిలో మొదటి నుంచి క్రైమ్ రేట్ ఎక్కువ. స్టేషన్ పరిధి కూడా ఎక్కువే. అలాగే నిజామాబాద్ రూరల్ స్టేషన్ కూడా ఎస్‌హెచ్‌వోగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఒక్కో స్టేషన్ చొప్పున అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కమిషనరేట్ పరంగా పోలీస్ కమిషనర్‌కు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి నాలుగో టౌన్, రూరల్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్వోలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి.