అక్షరటుడే, వెబ్డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండగా, అవి 2 నెలల పసికందు ప్రాణాన్ని బలిగొన్నాయి. మానవత్వాన్ని కలచివేసే ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సీతాపూర్ జిల్లా(Sitapur District)లోని ఓ గ్రామానికి చెందిన మహిళకు రెండు నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. నిన్న మధ్యాహ్నం పాపను ఇంట్లో ఊయలలో పడుకోబెట్టి తల్లి బయట పనులకెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కోతుల గుంపు లోపలికి ప్రవేశించింది.
Uttar Pradesh | చిన్నారి ప్రాణం తీసిన కోతి..
అందులోని ఒక కోతి నిద్రలో ఉన్న పాపను ఎత్తుకుని ఇంటి పైకప్పుపైకి వెళ్లి, నీటి డ్రమ్ము(Water Drum)లో పడేసింది. అప్పటికే పాప నీటిలో మునిగిపోయి గట్టిగా ఏడుస్తూ జీవన్మరణ యాతన ఎదుర్కొంది. ఇంతలో ఇంటికి తిరిగి వచ్చిన తల్లి పాప కనిపించకపోవడంతో ఎక్కడికెళ్లిందో అని ఆందోళన చెందింది. ఈ క్రమంలో పైకప్పు వైపు పాప ఏడుపు వినిపించడంతో పరుగెత్తి వెళ్లింది. డ్రమ్ములో పాపను గుర్తించిన మహిళ వెంటనే బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే పాప మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ విషాదకర ఘటనతో గ్రామమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. కన్నబిడ్డను కోల్పోయిన తల్లి విలపిస్తున్న దృశ్యాలు అందరి కళ్లు తడిపించాయి
గ్రామస్థులు ఫారెస్ట్ అధికారుల(Forest Officers)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. ప్రతి రోజు కోతుల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ రోజు బాలిక ప్రాణం పోయింది, రేపెవరో తెలియదు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహా ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కోతుల దాడులకు చెక్ వేసేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల సోషల్ మీడియాలో కూడా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి మరణానికి బాధ్యత వహించాల్సింది అటవీశాఖనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.