Uttar Pradesh
Uttar Pradesh | వ‌ర‌ద‌ల‌తో యూపీ అతులాకుత‌లం.. ఉప్పొంగుతున్న గంగా, య‌మున‌, వ‌రుణ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | భారీ వ‌ర‌ద‌ల‌తో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వరదలు కొనసాగుతున్నాయి. గంగా, యమునా, వరుణ వంటి ప్రధాన నదులు ప్రమాదస్థాయిలో ప్ర‌వ‌హిస్తున్నాయి. భారీ వ‌ర‌ద‌లు (Heavy Floods) జ‌న జీవ‌నాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేశాయి. 11,248 మంది నిరాశ్రయులు కాగా, 343 ఇళ్లు దెబ్బతిన్నాయి. 4 వేల హెక్టార్ల‌లో పంట‌లు నీట మునిగాయి. మొత్తంగా వరద సంబంధిత సంఘటనలలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వెంట‌నే స్పందించిన యోగి స‌ర్కారు (Yogi Government) స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది.

Uttar Pradesh | ప్రమాద‌క‌ర స్థాయిలో..

భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రంలో ప్ర‌ధాన న‌దుల‌న్నీ ఉప్పొంగుతున్నాయి. వారణాసిలో గంగా ప్రమాదక‌ర స్థాయిలో ప్ర‌వ‌హించింది. గంగా నది 71.26 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించి 71.66 మీటర్లకు చేరుకుంది. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలోని (Sri Kashi Vishwanath Temple) గంగా ద్వారం నమో ఘాట్‌లోని శిల్పాలతో సహా 84 ఘాట్‌లను ముంచెత్తింది. అస్సీ ఘాట్ వద్ద రోడ్లపైకి నీరు చేరి జగన్నాథ ఆలయ ద్వారాల వ‌ద్ద‌కు చేరింది. దీంతో పోలీసులు బారికేడ్లు పెట్టి భ‌క్తుల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు.

6 వేల మందికి పైగా ఇక్క‌డ నిరాశ్ర‌యులు కాగా.. వారి కోసం 20 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వరుణ నది కూడా ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఆవాసాల‌తో పాటు పంట‌లు దెబ్బ తిన్నాయి. కాన్పూర్ నగర్, ప్రయాగ్‌రాజ్, వారణాసి, బల్లియా, బండా, ఘాజీపూర్, చిత్రకూట్, మీర్జాపూర్, ఆగ్రా, ఇతర జిల్లాలతో సహా 17 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Uttar Pradesh | స‌హాయ‌క చ‌ర్య‌లు..

వ‌ర‌దల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) క్షేత్రస్థాయి సహాయ చర్యలను పర్యవేక్షించడానికి 11 మంది సభ్యుల మంత్రివర్గ బృందాన్ని నియమించారు. మంత్రులు ప్రయాగ్‌రాజ్, వారణాసి, జలౌన్, హమీర్‌పూర్ మరియు బల్లియాతో సహా ప్రభావిత జిల్లాలను సందర్శించారు. వ‌ర‌ద బాధితుల కోసం 905 స‌హాయ‌క శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. వారికి ఆహారం, నిత్యావ‌స‌రాలు అందిస్తున్నారు. వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ఆరోగ్య సిబ్బందిని మొత్తం క్షేత్ర స్థాయిలో మోహ‌రించారు.