అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | టీమిండియా మరోసారి సొంత గడ్డపై టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి టెస్టు నవంబర్ 14న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ (Kolkata Eden Gardens)లో ప్రారంభం కానుండగా, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి అసోం రాష్ట్రంలోని గువాహటిలో జరగనుంది.
ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27)లో భారత్‌కు మూడో సిరీస్ కాగా, సౌతాఫ్రికా (South Africa)కు రెండోది. ఇప్పటి వరకు భారత్ ఇంగ్లాండ్‌తో వారి గడ్డపై 2-2తో సిరీస్ డ్రా చేసుకోగా, విండీస్‌ను 2-0 తేడాతో ఓడించింది. మరోవైపు సౌతాఫ్రికా పాకిస్థాన్‌తో 1-1తో సిరీస్‌ను ముగించింది. అందువల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవాలంటే ఇరు జట్లకీ ఈ సిరీస్ కీలకం అవుతోంది.
Team India | గువాహటి టెస్ట్ టైమింగ్స్‌లో మార్పులు
ఇప్పటికే రెండు జట్లు టెస్ట్ సిరీస్ (Test Series) కోసం ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈశాన్య భారతదేశంలో శీతాకాలంలో సాయంత్రం వేళల్లో త్వరగా చీకటి పడుతుందని బీసీసీఐ (BCCI) గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గువాహటి టెస్ట్ షెడ్యూల్‌లో అసాధారణ మార్పులు చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేబజిత్ సైకియా (BCCI Secretary Debajit Saikia) మాట్లాడుతూ .. ఈశాన్య ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకే వెలుతురు తగ్గిపోతుంది. అందుకే మ్యాచ్‌ను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించాం అని వెల్లడించారు. అందువల్ల గువాహటి టెస్టులో లంచ్ బ్రేక్ కంటే ముందే టీ బ్రేక్ ఉండనుంది. సాధారణంగా ఇది డే-నైట్ టెస్టుల్లోనే కనిపించే విధానం. కానీ ఈసారి ఇది డే మ్యాచ్‌లో అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
గువాహటి టెస్ట్ కొత్త షెడ్యూల్ చూస్తే..
- ఉదయం 8.30 గంటలకు – టాస్
- ఉదయం 9.00–11.00 గంటల వరకు – తొలి సెషన్
- 11.00–11.20 గంటల వరకు – టీ బ్రేక్
- 11.20–1.20 వరకు – రెండో సెషన్
- 1.20–2.00 గంటల వరకు – లంచ్ బ్రేక్
- 2.00–4.00 గంటల వరకు – మూడో సెషన్
అవసరమైతే ఆటను 4.30 గంటల వరకు పొడిగిస్తారు.
Team India | భారత్ vs సౌతాఫ్రికా టెస్ట్ రికార్డులు
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 44 టెస్టులు జరిగాయి. అందులో సౌతాఫ్రికా 18 విజయం, భారత్ 16 విజయాలు, 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ గడ్డపై జరిగిన 19 టెస్టుల్లో, ఇండియా 11,సౌతాఫ్రికా 5, 3 డ్రా అయ్యాయి. గత సారి (2019/20 సిరీస్‌లో) భారత్ సౌతాఫ్రికాపై 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది. సౌతాఫ్రికా చివరిసారి భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచింది 1999/2000 సీజన్‌లో – అప్పట్లో హాన్సీ క్రాంజే నాయకత్వం వహించాడు. అయితే ఈ సారి భారత్ గెలుపు కోసం సన్నాహాలు చేస్తుండగా, సౌతాఫ్రికా మాత్రం చరిత్రను తిరగరాయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్ట్ సిరీస్ క్రికెట్ అభిమానులకు ఆసక్తికరంగా ఉండనుంది.
