అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే శుక్రవారం అలస్కాలో పుతిన్(Putin), ట్రంప్ సమావేశమయ్యారు. రెండున్నర గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగించారు. శుక్రవారం ఇద్దరు నాయకులు అలాస్కాలో 2.5 గంటల పాటు సమావేశం నిర్వహించారు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే మార్గాలను చర్చించారు. ముఖ్యంగా, 2021లో జెనీవాలో పుతిన్ బైడెన్‌ను కలిసిన తర్వాత అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. సమావేశం అనంతరం ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిష్టంభనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే, చర్చలు ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ వెల్లడించారు.
Trump-Putin | మరిన్ని చర్చలు..
సమావేశంలో ఎలాంటి ఒప్పందం జరుగలేదని ట్రంప్ వెల్లడించారు. భేటీ ఫలప్రదంగా జరిగిందని, అన్ని అంశాలపై చర్చ జరిగిందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, మరికొన్ని సమస్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అన్నింటిపై ఏకాభిప్రాయం కుదరాకే ఒప్పందంపై సంతకం చేసే ప్రక్రియ ముందుకు వస్తుందన్నారు. త్వరలోనే తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క్(Ukrainian President Zelensky)తో పాటు యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని వెల్లడించారు.
Trump-Putin | నిర్మాణాత్మక చర్చలు..
ట్రంప్‌తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీతో ఉన్నానని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించడానికిఈ భేటీ తొలి అడుగు అని తెలిపారు. కాల్పుల విరమణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ఆయన.. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి క్లిష్టమైన పరిస్తితులు ఉన్న తరుణంలో ట్రంప్‌తో భేటీ అర్థవంతంగా జరిగిందన్నారు.
Trump-Putin | ట్రంప్ ఉంటే యుద్ధమే వచ్చేది కాదు..
మరోవైపు 2022లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధమే వచ్చేది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు 2022లో ట్రంప్ వైట్ హౌస్(White House)లో ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం ఎప్పటికీ ప్రారంభం అయ్యేది కాదన్నారు. ఎవరి పేరును ప్రస్తావించకుండా, ఉక్రెయిన్ యుద్ధం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడి విధానాన్ని విమర్శిస్తూ, పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవడానికి బైడెన్‌ను ఒప్పించడానికి తాను చాలా ప్రయత్నించానని వెల్లడించారు. ”
ట్రంప్ అప్పట్లో అధ్యక్షుడిగా ఉంటే, యుద్ధం ఉండేది కాదు, అది నిజంగా అలాగే ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని పుతిన్ అన్నారు.రష్యా ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌లో పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తున్నారు. బైడెన్‌కు బదులుగా తాను పదవిలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని ట్రంప్ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు పుతిన్ చెప్పడం గమనార్హం.