అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar CM | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఓటర్లపై వరాలు జల్లు కురుస్తోంది. ఇప్పటికే మహిళలు, ఉద్యోగులు, వివిధ వర్గాలపై వరాలు కురిపించిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (CM Nitish Kumar) తాజాగా యువతకు లబ్ధి చేకూర్చే ఆఫర్ ప్రకటించారు.
స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (Student Credit Card Scheme) కింద ఇచ్చే విద్యా రుణాలపై వడ్డీ మాఫీ చేయనున్నట్లు నితీశ్ మంగళవారం ప్రకటించారు. తాజా నిర్ణయంతో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు భారీ ఉపశమనం కలుగనుంది. “స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ఇచ్చే విద్యా రుణం వడ్డీ లేకుండా ఉంటుందని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని నితీశ్ ‘X’లో పేర్కొన్నారు.
Bihar CM | రుణ చెల్లింపుల గడువు పొడిగింపు
సాధారణ పురుషులకు 4 శాతం వడ్డీ రేటుతో, స్త్రీలు, వికలాంగులు 1 శాతం వడ్డీ రేటుతో రూ. 4 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నారు. అయితే, ఇక నుంచి ఆ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, రుణ చెల్లింపు వ్యవధిని పొడిగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో, రూ. 2 లక్షల వరకు రుణాలను 60 నెలవారీ వాయిదాల్లో (5 సంవత్సరాలు) తిరిగి చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అదే గరిష్టంగా 84 నెలవారీ వాయిదాలకు (7 సంవత్సరాలు) పొడిగించబడింది. రూ. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు, తిరిగి చెల్లించే గడువును ప్రస్తుతమున్న 84 నెలవారీ వాయిదాలకు (7 సంవత్సరాలు) బదులుగా గరిష్టంగా 120 నెలవారీ వాయిదాలకు (10 సంవత్సరాలు) పొడిగించారు.
Bihar CM | మనోధైర్యాన్ని పెంచేందుకు..
విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించగలరని నిర్ధారించడమే బీహార్ ప్రభుత్వ (Bihar Government) లక్ష్యమని నితీశ్‌కుమార్ అన్నారు. “ఈ నిర్ణయాలు విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచుతాయి, వారు మరింత ఉత్సాహం, అంకితభావంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కల్పిస్తాయి, తద్వారా వారి సొంత భవిష్యత్తును మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతారు” అని బీహార్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.