అక్షరటుడే, వెబ్‌డెస్క్: స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్’ (Swasth Nari.. Sashakt Parivar) అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ఈరోజు (సెప్టెంబర్ 17) ప్రారంభమవుతుంది. వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయినుంచి నగరాల వరకు అన్ని చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలు(Medical tests) చేస్తారు.
మారిన జీవనశైలి, వాతావరణంలో మార్పుల కారణంగా మహిళలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా బీపీ(BP), షుగర్, క్యాన్సర్(Cancer)లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స, మందులు అందించడం కోసం ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్లె దవాఖానాల నుంచి జిల్లా హాస్పిటల్స్‌తో పాటు బోధనాస్పత్రుల పరిధిలోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మెడికల్ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ తదితర వైద్యులు శిబిరాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ హాస్పిటల్సే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు.
Swasth Nari.. Sashakt Parivar | చేసే పరీక్షలు..
- హైబీపీ, షుగర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తదితర పరీక్షలు చేస్తారు.
- రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కిశోర బాలికలతోపాటు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- అవసరమైనవారికి టీబీ పరీక్షలూ చేయనున్నారు.
- గిరిజన ప్రాంతాలలో సికెల్ సెల్ ఎనీమియా (కొడవలి కణ రక్తహీనత) పరీక్షలు నిర్వహించి, సికెల్ సెల్ డిసీజ్ కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇస్తారు. యువతులకు పలు ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కల్పించనున్నారు.