అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uber | వాహన సేవల సంస్థ ఉబర్(Uber)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. వేగవంతమైన సేవలు పొందేందుకు తమ యాప్‌లో ‘అడ్వాన్స్ టిప్స్’ ఫీచర్(Advance Tips Feature)ను అనైతిక, అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా పేర్కొంటూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఐ) (Central Consumer Protection Authority) నోటీసులు జారీ చేసింది. Rapido, Ola వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయా? అన్నది కూడా అథారిటీ పరిశీలిస్తోంది. రైడర్లు రద్దీ సమయాల్లో వేగవంతమైన సేవలను ప్రోత్సహించడానికి, డ్రైవర్ ఆదాయాలను పెంచడానికి ట్రిప్‌కు ముందు టిప్‌ను జోడించడానికి అనుమతిస్తున్నట్లు ఉబెర్ గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. అయితే, తన యాప్‌లో “ముందస్తు టిప్పింగ్”(Early tipping) అనే కొత్త ఫీచర్‌ను నెల క్రితమే ప్రవేశపెట్టబడింది. రైడ్ హెయిలింగ్ యాప్ “మీరు టిప్‌ను జోడిస్తే, డ్రైవర్ ఈ రైడ్‌ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మీ డ్రైవర్ 100% టిప్‌ను అందుకుంటాడు. మీరు ఇప్పుడు టిప్‌ను జోడిస్తే, మీరు దానిని తర్వాత మార్చలేరు” అని పేర్కొంది.
Uber | దోపిడీపై ఫిర్యాదులు
మహానగరాల్లో సమయం ఆదా చేస్తూ ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే గుర్తొచ్చేది క్యాబ్ సేవలు. అయితే, క్యాబ్ సేవలు అందించే సంస్థలు వినియోగదారుల అవసరాలను అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి. క్యాబ్ బుకింగ్(Cab booking) సమయంలో త్వరితగతిన సేవలు వినియోగించుకునేందుకు అడ్వాన్స్ టిప్(Advance tip) పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. రైడ్ బుకింగ్(Ride booking) సమయంలో అడ్వాన్స్ టిప్(Advance tip) అంటూ రూ.50, రూ.75, 100 చొప్పున టిప్ పేరుతో అదనపు దోపిడీకి పాల్పడుతుండడంపై వినియోగదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ.. తాజాగా ఉబేర్‌కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ‘ముందస్తు టిప్’ ఆచారం చాలా ఆందోళనకరమైనది. వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను ముందస్తుగా టిప్ చెల్లించమని బలవంతం చేయడం అనైతికమైనది. ఇది దోపిడీకి దారితీస్తుంది. ఇటువంటి చర్యలు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కిందకు వస్తాయి. టిప్‌ను ప్రశంసా చిహ్నంగా ఇస్తారు, సేవ తర్వాత హక్కుగా కాదు” అని ఆయన ‘X’లో పోస్ట్ పెట్టారు. మరోవైపు, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి, CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే స్పందిస్తూ.. ఇటువంటి పద్ధతి వినియోగదారులను దోపిడీ చేయడానికి దారి తీస్తుందన్నారు. ఈ రంగంలో ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్‌లపై మేము నిఘా ఉంచుతున్నామని చెప్పారు.