అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar CM | బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) ముందర ప్రభుత్వం అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా మరో ప్రకటన చేసింది. డిగ్రీ చదివిన నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున అందించనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్(CM Nitish Kumar) గురువారం ప్రకటించారు.
‘ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ్ భట్టా యోజన’ కింద గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) నెలకు రూ. 1,000 చొప్పున రెండేళ్ల పాటు అందిస్తుందని తెలిపారు. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు ఈ పథకం వర్తించేది. ఇప్పుడు డిగ్రీ చదివిన వారికి కూడా వర్తిస్తుందన్నారు.
Bihar CM | యువత సాధికారత కోసం..
నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో అమలులో ఉన్న ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ భత్యాన్ని విస్తరించినట్లు Xలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు సాధికారత కల్పించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేశారు. “రాష్ట్ర ప్రభుత్వం ఏడు పరిష్కారాల కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ‘ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయ భట్ట యోజన’ ఇప్పుడు విస్తరించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
దీని కింద గతంలో ఇంటర్మీడియట్ పాసైన యువతకు అందించబడుతున్న స్వయం సహాయ ప్రభుత్య పథకం ప్రయోజనం ఇప్పుడు ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌లో పాసైన నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు విస్తరించబడిందని” వెల్లడించారు. చదువుకోని, ఉద్యోగాలు/ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న, స్వయం ఉపాధి లేని, లేదా ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ప్రభుత్వేతర ఉపాధి పొందని 20-25 సంవత్సరాల వయస్సు గల గ్రాడ్యుయేట్ పాసైన యువతకు నెలకు రూ. 1000 చొప్పున గరిష్టంగా రెండు సంవత్సరాల పాటు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.ఈ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయం యువత స్వావలంబన, నైపుణ్యం, ఉపాధికి సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుందని, రాష్ట్రం, దేశం రెండింటి అభివృద్ధికి సానుకూలంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.