అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Illegal Mining | ఎడపల్లి మండలంలో యథేచ్ఛగా మొరం దందా సాగుతోంది. నిత్యం వందలాది టిప్పర్లలో అక్రమంగా మొరం తరలిస్తున్నారు.
అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఎడపల్లి మండలం జానకంపేట – మల్కాపూర్ గ్రామాల శివారులో కొందరు మొరం తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు తీసుకున్న దానికంటే అధికంగా మొరం తవ్వుతున్నారు. జేసీబీల (JCB) సాయంతో మొరం తవ్వకాలు చేపట్టి నిత్యం వందల టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో (Over Load) నిత్యం మొరం టిప్పర్లు వెళ్తుండడంతో ఆ రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Illegal Mining | గుట్టలు మాయం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొరం వ్యాపారులు గుట్టలను మాయం చేస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టి టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జానకంపేట (Janakampet) శివారులోని గుట్టలను మొరం వ్యాపారులు ఖతం చేస్తున్నారు. నిత్యం వందల టిప్పర్లలో మొరం తరలిస్తుండడంతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు చేపట్టి నిజామాబాద్ (Nizamabad) నగరంతో పాటు, బోధన్ తదితర ప్రాంతాలకు మొరం తరలిస్తున్నారు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
Illegal Mining | పట్టించుకోని అధికారులు
అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. జానకంపేట శివారులో మొరం దందా రెవెన్యూ అధికారుల (Revenue Officers) కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు మామూళ్లు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.