HomeతెలంగాణBanakacharla Project | మార‌ని ఆంధ్ర మీడియా.. తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తీసే ఎత్తుగ‌డ

Banakacharla Project | మార‌ని ఆంధ్ర మీడియా.. తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తీసే ఎత్తుగ‌డ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla Project | తెలంగాణ భావ‌జాలాన్ని తొలి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆంధ్ర మీడియా(Andhra Media).. రాష్ట్ర విభ‌జన త‌ర్వాత కూడా మార‌లేదు. తెలంగాణకు వ్య‌తిరేకంగా దుష్ప్ర‌చారం చేయ‌డంలో, ప్ర‌జ‌ల‌ మెద‌ళ్ల‌లో విష బీజాలు నాట‌డంలో త‌మ‌ వైఖ‌రిని మార్చుకోలేదు. ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న ఈ వ్య‌తిరేక ధోర‌ణిని ఆంధ్ర పత్రిక‌లు, చాన‌ళ్లు ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నాయి. అందుకు తాజా నిద‌ర్శ‌న‌మే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశం. తెలంగాణ భూముల‌ను ఎండ‌బెట్టి, ఈ ప్రాంత రైతుల నోట్లో మ‌ట్టి కొట్టే ఈ ప్రాజెక్టును స‌మ‌ర్థిస్తూ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నది. త‌ప్పుడు క‌థ‌లు ప్ర‌సారం చేస్తున్నది. స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోయే మిగులు జ‌లాల‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ ప్ర‌భుత్వం(Andhra Pradesh Government) చేస్తున్న ప్ర‌య‌త్నం త‌ప్పెలా అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్న‌ది.

Banakacharla Project | బ‌న‌క‌చ‌ర్ల చిచ్చు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెట్టింది. మిగులు, వ‌ర‌ద జ‌లాల ఆధారంగా దాదాపు రూ.82 వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇప్ప‌టికే ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎప్ ఆర్‌), స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రానికి స‌మ‌ర్పించిన ఏపీ.. అనుమ‌తులు తెచ్చుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. మోదీ స‌ర్కారు(Modi government) మ‌నుగ‌డ‌లో కీల‌కంగా మారిన తెలుగుదేశం పార్టీ.. దీన్ని సాకుగా తీసుకుని కేంద్రం నుంచి రావాల్సిన అనేక ప్ర‌యోజ‌నాల‌ను తెచ్చుకుంటోంది. అయితే, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను తీవ్రంగా దెబ్బ తీస్తున్న‌ప్ప‌టికీ, అలాంటిదేమీ ఉండ‌ద‌ని తాము మిగులు జ‌లాల‌నే వినియోగించుకుంటామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు(AP Chief Minister Chandrababu) చెబుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుకు తామెప్పుడూ అడ్డు ప‌డ‌లేద‌ని, త‌మ ప్రాజెక్టుల విష‌యంలో అడ్డుప‌డ‌డం స‌రికాద‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణ స‌ర్కారు మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డుకుని తీర‌తామ‌ని, ఇందుకోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని తెలిపింది. కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డంతో పాటు న్యాయ పోరాటం చేస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్ర‌క‌టించారు.

Banakacharla Project | విష బీజాలు నాటుతున్న మీడియా..

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రెండు ప్ర‌భుత్వాలు త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా(Mainstream media) మాత్రం ఒక‌వైపు వాద‌న‌ను మాత్ర‌మే ప్ర‌చారంలోకి తీసుకొస్తోంది. ఏపీ వైఖ‌రిని స‌మ‌ర్థిస్తూ, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు నిర్మాణానికి మ‌ద్ద‌తు తెలుపుతూ క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తోంది. ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిస్తోంది. బ‌న‌క‌చ‌ర్ల వ‌ల్ల తెలంగాణ(Telangana) ప్ర‌యోజ‌నాల‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని వాద‌న‌ను తెర పైకి తీసుకొస్తోంది. ఇందుకోసం అబ‌ద్ధ‌పు, అస‌త్య‌పు క‌థ‌నాల‌ను అల్లి ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో విష‌బీజాలు నాటుతోంది. తెలంగాణ రైతుల‌కు తీవ్ర న‌ష్ట‌మ‌ని జ‌రుగుతున్న వాద‌న‌ను తొక్కిపెడుతూ, ప్రాజెక్టు వ‌ల్ల రెండు రాష్ట్రాల‌కు లాభం జ‌రుగుతుంద‌నే స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

తొలినుంచి తెలంగాణ వాదాన్ని, భావ‌జాలాన్ని వ్య‌తిరేకించిన ఆంధ్ర పత్రిక‌లు, చాన‌ళ్లు ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుకు వంత పాడుతూ క‌థ‌నాలు వండి వార్చుతుండ‌డంపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆంధ్ర ప‌త్రిక‌లు, చాన‌ళ్లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తాజాగా తెలంగాణ సోష‌ల్ ఫౌండేష‌న్ (టీఎస్ ఎఫ్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఒంటెద్దు న‌ర్సింహారెడ్డి(Narasimha Reddy) ఎత్తి చూపారు. తెలంగాణ జ‌ల వ‌నరులు-వ్య‌వ‌సాయం- నాడు, నేడు, రేపు అంశంపై హైద‌రాబాద్‌లో జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో.. ఆయ‌న మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి మ‌ద్ద‌తుగా, తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలను ఆయ‌న ప్ర‌స్తావించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఆంధ్రా మీడియా దానిని వక్రీకరించి రాస్తుందని మండిప‌డ్డారు. బనకచర్ల తో మనకు నష్టం జరిగితే.. తెలంగాణకు బనకచర్ల తో నష్టం లేదని ఆంధ్రా పేపర్లు రాస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని, ఆంధ్రా మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.