Homeబిజినెస్​IPO | మార్కెట్‌లో అనిశ్చితి.. నిరాశ పరుస్తున్న ఐపీవోలు

IPO | మార్కెట్‌లో అనిశ్చితి.. నిరాశ పరుస్తున్న ఐపీవోలు

లిస్టింగ్‌ గెయిన్స్‌ అందిస్తాయన్న ఆశతో ప్రైమరీ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నవారిని మార్కెట్‌ నిరాశ పరుస్తోంది. ఈ వారంలో లిస్టయిన రెండు మెయిన్‌బోర్డ్‌ కంపెనీలు నష్టాలను ఇచ్చాయి. ఓర్క్‌లా లాభాలతో ప్రారంభమై వెంటనే నష్టాల్లోకి జారుకోగా.. స్టడ్స్‌ నష్టాలతోనే ప్రస్థానాన్ని ప్రారంభించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌ ఎటూ తేలకపోవడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతుండడంతో మార్కెట్లు నిలదొక్కుకోలేకపోతున్నాయి.

దీని ప్రభావం ప్రైమరీ మార్కెట్‌(Primary Market)పైనా పడుతోంది. భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవుతున్న ఐపీవో (IPO)లు సైతం లిస్టింగ్‌ గెయిన్స్‌ ఇవ్వలేకపోతున్నాయి. గురువారం లిస్టయిన ఓర్క్‌లా స్వల్ప లాభాలతో ప్రారంభమై వెంటనే నష్టాల్లోకి జారుకోగా.. శుక్రవారం లిస్టయిన స్టడ్స్‌ యాక్సెసరీస్‌ నష్టాలతోనే ప్రస్థానాన్ని ప్రారంభించింది.

స్టడ్స్‌ యాక్సెసరీస్‌..

ప్రముఖ హెల్మెట్‌ల తయారీ సంస్థ అయిన స్టడ్స్‌ యాక్సెసరీస్‌(Studds Accessories) మార్కెట్‌నుంచి రూ. 445.49 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. గతనెల 30 నుంచి నవంబర్‌ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించింది. ఈ కంపెనీ మొత్తం 73.25 రెట్లు సబ్‌స్క్రైబ్‌(Over subscribe) కాగా.. రిటైల్‌ పోర్షన్‌ 22.08 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. చిన్న ఇష్యూ కావడం, భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడంతో ప్రారంభ లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ వారి ఆశలపై మార్కెట్‌ నీళ్లు చల్లింది. కంపెనీ షేర్లు శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవనున్నాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 585కు విక్రయించగా.. 3.42 శాతం డిస్కౌంట్‌(Discount)తో రూ. 565 వద్ద ప్రారంభమైంది. అంటే లిస్టింగ్‌ సమయంలోనే ఒక్కో షేరుపై రూ. 20 వరకు నష్టం వచ్చిందన్నమాట. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో షేరు ధర కాస్త పెరిగి, రూ. 575 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఓర్క్‌లా ఇండియా..

ఎంటీఆర్‌ ఫుడ్స్‌(MTR Foods) పేరుతో ఇండియాలో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను విక్రయించే నార్వేకు చెందిన ఓర్క్‌లా కంపెనీ ఐపీవో (Orkla Company IPO)ద్వారా రూ. 1,667.54 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 730కి విక్రయించగా.. 2.75 శాతం ప్రీమియం(Premium)తో రూ. 750 వద్ద లిస్టయ్యింది. అయితే లిస్టయిన వెంటనే స్టాక్‌ ధర పతనమైంది. గత సెషన్‌లో రూ. 713.65 కు పడిపోయింది. శుక్రవారం మరింత తగ్గి రూ. 707 వద్ద కొనసాగుతోంది.

Must Read
Related News