అక్షరటుడే, కామారెడ్డి: New Year Celebrations | జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలు నిషేధమని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. డీజేలు, పటాకులకు అనుమతి లేదని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు పక్కా కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, అధిక వేగంతో ప్రయాణించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు (New Year Celebrations) జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
New Year Celebrations | వేడుకలు విషాదం కాకూడదు
నూతన సంవత్సరం ఆనందంగా ప్రారంభం కావాలి తప్పా.. నిర్లక్ష్యం కారణంగా విషాదంగా మారకూడదన్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆధారంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
New Year Celebrations | ప్రధాన కూడళ్లలో..
ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీస్ బృందాలు వాహనాల తనిఖీలు నిర్వహిస్తాయని ఎస్పీ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడా న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లు, క్లబ్బులు, గేటెడ్ కమ్యూనిటీలలో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు భయాందోళన కలిగించే క్రాకర్స్, టపాసులు, అధిక శబ్దం కలిగిన డీజేలు, ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై పూర్తిగా నిషేధం ఉందన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల (CCTV cameras) ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, రహదారులు బ్లాక్ చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, నిషేధిత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాల విక్రయం, వినియోగానికి పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
New Year Celebrations | మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మైనర్లకు మద్యం విక్రయించడం నేరమని, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించిన వాహనాలు, శబ్ద కాలుష్యం చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, గుంపులుగా రోడ్లపై తిరగడం చేయరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ అధికారులను లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. పోలీస్ శాఖకు సహకరించి, శాంతియుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.