అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | అత్తింటి వేధింపు తాళలేక గృహిణులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా.. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి (Nallvelly) గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సందీప్ (Si Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీరడి హేమలత అలియాస్ సంధ్య (32) అనే గృహిణి అత్తింటి వేధింపులు తాళలేక వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొరట్పల్లి(Koratpally) గ్రామానికి చెందిన హేమలతను 11 సంవత్సరాల క్రితం నల్లవెల్లి గ్రామానికి చెందిన నీరడి గంగాధర్‌కు ఇచ్చి వివాహం చేశారు.
కాగా కొంత కాలంగా అదనపు కట్నం తీసుకురావాలని సదరు మహిళను భర్త గంగాధర్, అత్త ఎల్లవ్వ హింసిస్తున్నారు. మృతురాలికి పిల్లలు లేకపోవడంతో హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు ఇవ్వమని వేధించేవారని సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు రెండు మూడుసార్లు మాట్లాడి సర్ది చెప్పినా భర్త గంగాధర్ తన ప్రవర్తన మార్చుకోలేదు. శుక్రవారం సాయంత్రం హేమలతను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆమె జీవితంపై విరక్తితో గౌరారం శివారులోని వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.