అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar | సామాజిక కట్టుబాట్లకు భిన్నంగా బీహార్లో చోటు చేసుకున్న ఓ అరుదైన ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుపౌల్ జిల్లా (Supaul District) త్రివేణిగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు పరస్పర అంగీకారంతో స్వలింగ వివాహం చేసుకున్నారు.
ఓ మాల్లో కలిసి పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి తర్వాత ప్రేమ వరకు వెళ్లింది. చివరకు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వివరాల ప్రకారం, ఈ నెల 23వ తేదీ రాత్రి త్రివేణిగంజ్ (Triveniganj)లోని మేళా గ్రౌండ్ సమీపంలో ఉన్న ఓ ఆలయానికి చేరుకున్న ఈ యువతులు, అతి కొద్దిమంది సాక్షుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Bihar | స్వలింగ వివాహం..
సంప్రదాయంగా అగ్నిహోత్రం చుట్టూ కాకుండా, గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు నడిచి వివాహం చేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమం అప్పటికప్పుడు బయటకు తెలియలేదు. గత రెండు నెలలుగా త్రివేణిగంజ్లోని వార్డు నంబర్ 18లో ఉన్న ఓ అద్దె గదిలో ఈ ఇద్దరు యువతులు కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం పెళ్లి అనంతరం వారు తిరిగి తమ గదికి చేరుకోవడంతో విషయం స్థానికంగా వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటికే ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారాయి.వివాహం చేసుకున్న యువతులను మధేపురా జిల్లా (Madhepura District)కు చెందిన పూజా గుప్తా (21), శంకర్పూర్ ప్రాంతానికి చెందిన కాజల్ కుమారి (18) గా గుర్తించారు.
ఈ వివాహంలో పూజా గుప్తా వరుడి పాత్రలో, కాజల్ కుమారి వధువు పాత్రలో నిలిచారు. తమకు పురుషులపై ఆసక్తి లేదని, తమ బంధం పూర్తిగా మానసిక అనుబంధం, పరస్పర అవగాహనపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన బీహార్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా సమర్థిస్తుండగా, మరికొందరు సంప్రదాయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ స్వలింగ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
View this post on Instagram