అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad Police | నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (Traffic Police Station)లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందిపై బదిలీ (Transfer) వేటు పడింది. ఓ కానిస్టేబుల్, మరో హోంగార్డును హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న ఫయాజ్, ట్రాఫిక్ సీఐకు డ్రైవర్‌గా పని చేస్తున్న హోంగార్డు షాకీర్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ అయిన వారిలో ఉన్నారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందిని హెడ్ క్వార్టర్ (Head Quarter)కు అటాచ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రత్యేకించి ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. డ్రంకన్ డ్రైవ్ కేసులు (Drunk and Drive Case), వాహనాల తనిఖీ (Vehicle Checking) సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి నెలనెలా ముక్కుపిండి మరి మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. అయితే అధికారుల అండదండలు లేకుండా సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో వచ్చిన వసూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. తాజాగా కానిస్టేబుల్, హోంగార్డును అటాచ్ చేశారు.
Nizamabad Police | నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?
ట్రాఫిక్ విభాగంలో ఆరోపణలపై సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) దృష్టి సారించారు. ప్రాథమికంగా ఇద్దరు సిబ్బందిని ఆ విభాగం నుంచి తప్పించారు. తదుపరిగా అధికారులపై చర్యలు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా జరిపి ట్రాఫిక్ కష్టాలను తీర్చాల్సిన అధికారులు.. ఏకంగా తమ ఆదాయ మార్గాలను సమకూర్చుకునే పనిలో పడడం పట్ల నగరవాసులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో తమకు మామూళ్లు ఇచ్చే బడా వ్యాపారుల జోలికి వెళ్లట్లేదని.. పార్కింగ్ సదుపాయం లేదంటూ చిరు వ్యాపారులపైనే ప్రతాపాన్ని చూపిస్తున్నారని చర్చించుకుంటున్నారు.