అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Central University | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో కాపీ చేస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ ఘటన యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
గచ్చిబౌలి (Gachibowli)లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్-టీచింగ్ విభాగంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ (30) హాజరయ్యాడు.
Hyderabad Central University | ఏఐ టెక్నాలజీతో..
పరీక్ష రాస్తున్న సమయంలో అతని చెవిలో ఉన్న బ్లూటూత్ డివైస్ (Bluetooth Device) నుంచి పదేపదే బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ అనుమానం వ్యక్తం చేసి తనిఖీ చేపట్టాడు. ఈ తనిఖీలో అనిల్ షర్ట్‌కు అమర్చిన స్కానర్ డివైస్ బయటపడింది. అనిల్ క్వశ్చన్ పేపర్‌ను ఆ స్కానర్ ద్వారా స్కాన్ చేసి, బాత్రూంకు వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సాయంతో సమాధానాలు తెలుసుకుని, చెవిలో ఉన్న బ్లూటూత్ ద్వారా వింటూ జవాబులు రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పరీక్ష హాలులోని ఇతర అభ్యర్థులను కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే హర్యానా (Haryana)కు చెందిన మరో యువకుడు సతీశ్ కూడా ఇదే తరహాలో హైటెక్ పద్ధతిలో కాపీ చేస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు, వారిని గచ్చిబౌలి పోలీసు (Gachibowli Police)లకు అప్పగించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం రిమాండ్‌కు తరలించారు.