అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Reliance IPO | భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎం) శుక్రవారం నిర్వహించనుంది. ఇది మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చేసే ప్రకటనల గురించి ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న రిలయన్స్ జియో(Jio), రిలయన్స్ రిటైల్ ఐపీవో(IPO)లపై ఈ సమావేశంలో ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు.
సాధారణంగా కంపెనీల ఏజీఎం(AGM)లు అంటే వ్యాపార వర్గాలతోపాటు ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తి చూపుతారు. సంస్థ భవిష్యత్ లక్ష్యాలు, ఎదురయ్యే ఆటంకాలు, వాటిని ఎలా అధిగమించనున్నారు, వృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్లనున్నారు తదితర విషయాలపై మేనేజ్‌మెంట్ ప్రకటన చేస్తుంది. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంపై వ్యాపార వర్గాలు ఇన్వెస్టర్ల(Investors)తో పాటు సామాన్యులు సైతం ఆసక్తి చూపుతారు.
కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రసంగం కోసం ఎదురుచూస్తారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో 44 లక్షల మంది వాటాదారులనుద్దేశించి అంబానీ ప్రసంగించనున్నారు. డిజిటల్, రిటైల్ మరియు ఇంధన వ్యాపారాలలో సంస్థ తదుపరి దశ వృద్ధి ప్రణాళికలు, రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్(Retail) వ్యాపారాలు, ఐపీవోల గురించి ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా మార్కెట్ ఏం ఆశిస్తుందో తెలుసుకుందామా..
రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపారాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ నేపథ్యంలో వీటిని వేర్వేరు ఐపీవోలుగా తీసుకువస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. దీనిపై ముకేశ్ అంబానీ 2019లోనే ప్రకటన చేసినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో రిలయన్స్ రిటైల్ వ్యాపార వృద్ధిని ఎలా వేగవంతం చేస్తారన్న దానిపై అంబానీ ప్రకటన కోసం ఇన్వెస్టర్లు నిరీక్షిస్తున్నారు.
రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్(Oil and Gas), టెలికాం, రిటైల్, మీడియా వంటి వ్యాపారాలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జియో బ్రెయిన్ అనే టూల్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా టెలికాం, ఇతర వ్యాపారాలను ఏకతాటిపైకి తీసుకురావాలనేది కంపెనీ ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై అంబానీ ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారు.
ఫాస్ట్ ఫ్యాషన్, క్విక్ కామర్స్ విభాగాలు వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా రిలయన్స్ ఎలా ముందుకు వెళ్తుందన్నది ఏజీఎం ద్వారా తెలిసే అవకాశాలున్నాయి. క్విక్ కామర్స్ సంస్థలకు రిలయన్స్ ఏ విధంగా పోటీ ఇస్తుందో చూడాలి.
గతేడాది ఏజీఎంలో జియో క్లౌడ్, జియో పీసీ గురించి ప్రకటనలు చేశారు. ఈసారి ఆర్‌ఐఎల్ న్యూ ఎనర్జీ ప్లాట్‌ఫాం గురించి ప్రకటనలు ఉంటాయని మార్కెట్ ఆశిస్తోంది. పాలీసిలికాన్ టు సోలార్ మాడ్యూల్స్, ఎలక్ట్రోలైజర్లు, బ్యాటరీలు మరియు గ్రీన్ హైడ్రోజన్(Green Hydrogen) ఉత్పత్తిని కవర్ చేసే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ గతంలో పేర్కొంది. పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్స్‌తో సహా టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లపై నవీకరణలు మరియు రాబోయే నాలుగు నుంచి ఆరు త్రైమాసికాలలో ఈ సౌకర్యాల కమీషనింగ్ జరుగుతుందని ఆశిస్తున్నారు. న్యూ ఎనర్జీ ప్లాట్‌ఫాం కాలక్రమేణా ఆర్‌ఐఎల్(RIL) సంప్రదాయ చమురు నుంచి రసాయనాలు (O2C) వ్యాపారంతో సమానంగా లాభాలను భావిస్తున్నారు.