అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sleeper Cells | అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(Isis)కు అనుబంధంగా పని చేస్తున్న ఇద్దరు స్లీపర్ సెల్స్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) శనివారం అరెస్టు చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుంది. ఇండియాలో ఐసిస్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీ చేస్తున్న ప్రయత్నాలలో ఈ అరెస్టులు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(International terrorist organization) ఐసిస్ స్లీపర్ సెల్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేయడం ద్వారా ఎన్ఐఏ కీలక విజయం సాధించినట్లయింది. ఇండోనేషియాలోని జకార్తా నుంచి ఇండియాకు వచ్చిన ఇద్దరు స్లీపర్ సెల్స్ డయాపర్‌వాలా అలియాస్ అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్‌ను శుక్రవారం రాత్రి టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు(Immigration Bureau officers) అడ్డుకున్నారు.
Sleeper Cells | రెండేళ్లకు పైగా పరారీలో..
అబ్దుల్లా, తల్హాఖాన్ రెండేళ్లుగా పరారీలో ఉన్నారని ఎన్ఐఏ(NIA) వెల్లడించింది. 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IED) తయారు చేయడం, పరీక్షించారని వారిపై గతంలోనే కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రణాళిక ప్రకారం దాడులు చేయడానికి కుట్ర పన్నారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఐసిస్ స్లీపర్ సెల్స్(Sleeper Cells) పని చేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. “ఈ ఇద్దరు రెండు సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్నారు. ముంబైలోని NIA ప్రత్యేక కోర్టు వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది” అని ఏజెన్సీ పేర్కొంది. వారి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని కూడా గతంలో ప్రకటించారు. షేక్, ఖాన్ పూణేలోని కొంధ్వా ప్రాంతంలో గల అద్దె నివాసంలో IEDలను సమీకరించడంలో చురుకుగా పాల్గొన్నారని NIA దర్యాప్తులో వెల్లడైంది. 2022-2023 సమయంలో, వారు అదే ప్రదేశంలో బాంబు తయారీ శిక్షణ వర్క్‌షాప్‌ను నిర్వహించారని, అక్కడ వారు తయారు చేసిన IEDని పరీక్షించడానికి నియంత్రిత పేలుడు నిర్వహించినట్లు తెలిసింది. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను NIA ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.