అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mexico Earthquake | మెక్సికోను (Mexico) భారీ భూకంపం వణికించింది. దక్షిణ–మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. గెరెరో రాష్ట్రంలోని (Guerrero state) శాన్ మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండటంతో, దాదాపు 33 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూకంప (Earthquake) ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా, సుమారు 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో అకాపుల్కో సమీపంలో ఈ భూకంపం సంభవించింది. భూప్రకంపనలు ఉత్తర దిశగా దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీ వరకు విస్తరించాయి.
Mexico Earthquake | భయంతో పరుగులు..
భూకంపం సంభవించిన వెంటనే హెచ్చరిక సైరన్లు (Siron) మోగడంతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికో సిటీలో భయంతో బయటకు వస్తున్న క్రమంలో ఓ అపార్ట్మెంట్లోని రెండో అంతస్తు నుంచి పడి 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మరో 12 మంది గాయపడ్డారని నగర మేయర్ క్లారా బ్రుగాడా వెల్లడించారు. అలాగే భూకంప కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు కూలడంతో 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయిందని గెరెరో రాష్ట్ర గవర్నర్ ఎవలిన్ సాల్గోడో తెలిపారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ (Mexican President Claudia Sheinbaum) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా భూప్రకంపనలు రావడంతో ప్రెస్‌మీట్‌ను (Pressmeet) మధ్యలోనే నిలిపివేశారు. అధ్యక్షురాలితో పాటు సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు సహాయం అందిస్తున్నాయని, మరిన్ని నష్టాలపై అంచనా వేస్తున్నామని మెక్సికో అధికారులు తెలిపారు. భూకంపానంతర ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.