Nizamabad City.
Nizamabad City | పింఛన్‌ డబ్బు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్‌..

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | పింఛన్‌ పంపిణీ కోసం తెచ్చిన డబ్బును చోరీ చేసిన కేసులో బీపీఎంతో పాటు అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌ రెడ్డి (ACP Raja Venkat Reddy) తెలిపారు. కేసు వివరాలను మీడియాకు శుక్రవారం వెల్లడించారు. పత్తి సాయికుమార్‌ అనే వ్యక్తి ముబారక్‌నగర్‌ బ్రాంచ్‌ పోస్టాఫీస్‌లో అసిస్టెంట్‌ బీపీఎంగా పనిచేస్తుండగా, పింఛన్‌ డబ్బులు కాజేయాలన్న దురాశ కలిగింది.

ఈ క్రమంలో మామిడిపల్లి బీపీఎం నరేంద్ర పింఛన్‌ పంపిణీ (pension distribution) కోసం గత ఆగస్టు 29న రూ.8లక్షలను నిజామాబాద్‌ కార్యాలయం నుంచి తెచ్చి, తన ఇంట్లో భద్రపరిచాడు. ఈ విషయం తెలిసిన సాయికుమార్‌ ఆ డబ్బును దొంగిలించాలనుకుని, తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేష్‌కు పథకం వివరించాడు. దీంతో అదే రోజు రాత్రి 10 గంటలకు పథకం ప్రకారం మామిడిపల్లికి వెళ్లి, రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తిగా నరేంద్ర ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. రాత్రి నిద్రపోయిన తర్వాత, రాకేష్‌ అక్కడి నుంచి పింఛన్‌ డబ్బులు దొంగిలించి, సాయికుమార్‌ వద్దకు తీసుకెళ్లాడు.

తరువాత ఇద్దరూ కలిసి డబ్బులు సాయికుమార్‌ ఇంట్లో దాచిపెట్టారు. ఈ మేరకు నరేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్త్‌ రూరల్‌ పోలీసులు (North Rural Police) సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం వారిద్దరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.8లక్షలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన ఎస్సై రాజశేఖర్, సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తాత్రిగౌడ్, రాజు, చరణ్, ఐటీ కోర్‌ సిబ్బంది సాగర్, సందీప్‌ను ఏసీపీ అభినందించారు.