అక్షరటుడే, వెబ్‌డెస్క్: TTD | తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి(TTD Governing Council) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్(Annamayya Bhavan)లో మంగళవారం ఉదయం టీటీడీ పాకలమండలి సమావేశం జరిగింది. ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసున్నారు. తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. అటవీ సంపదను 68.14 శాతం నుంచి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా 2025-26లో రూ.1.74కోట్లు, 2026-27లో రూ.1.13కోట్లు, 2027-28కు రూ.1.13 కోట్లు ప్రభుత్వ అటవీశాఖకు విడుదల చేయాలని నిర్ణయించారు.
TTD | ఆలయాల అభివృద్ధికి సమగ్ర బృహత్ ప్రణాళిక
టీటీడీ ఆధ్వర్యంలోని పలు ఆలయాల అభివృద్ధికి సమగ్ర బృహత్ ప్రణాళిక చేయాలని నిర్ణయించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం(Tiruchanur Padmavati Ammavari Temple), అమరావతి వేంకటేశ్వరస్వామి, కపిలతీర్థం(Kapila Tirtham) కపిలేశ్వరస్వామి, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి, నాగాలాపురం వేదనారాయణస్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల అభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్‌ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
TTD | స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అదనపు నిధులు
ఎందరో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి(SWIMS Super Specialty Hospital)కి అదనంగా నిధులు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఏడాదికి అందిస్తున్న రూ.60కోట్లతో పాటు అదనంగా మరో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా నిర్ణయించారు.
TTD | పాలక మండలి తీసుకున్న మరిన్ని నిర్ణయాలివే..
- ఆకాశగంగ, పాపవినాశనం వద్ద ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.
- టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం తెలిపారు.
- తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ(Anti-drone technology) వాడాలని నిర్ణయించారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశించారు.
- ఒంటిమిట్టలో భక్తులకు అన్నదాన సేవలను మరింత పెంచాలని నిర్ణయించారు.
- అనంతవరంలో టీటీడీ(TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.