HomeతెలంగాణTTD | అన్యమత ఉద్యోగులపై టీటీడీ ఛైర్మన్​ కీలక వ్యాఖ్యలు

TTD | అన్యమత ఉద్యోగులపై టీటీడీ ఛైర్మన్​ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఎంతో మంది అన్యమత ఉద్యోగులు పని చేస్తున్నారు. నిబంధనల మేరకు వీరు పని చేయడానికి అర్హులు కాకపోయినా.. నకిలీ సర్టిఫికెట్లతో ఏళ్లుగా కొలువులు చేస్తున్నారు.

అన్యమత ఉద్యోగులపై చర్యలు చేపట్టాలని హిందూ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల పలువురు అన్యమత ఉద్యోగులపై చర్యలు చేపట్టింది. తాజాగా టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు (TTD Chairman BR Naidu) అన్యమత ఉద్యోగుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ (Hyderabad)​లో మాట్లాడారు.

TTD | వారిపై చర్యలు తీసుకుంటాం

టీటీడీలో పని చేసే అన్యమత సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఛైర్మన్​ తెలిపారు. అలాగే వారిని వలంటరీ రిటైర్మెంట్​ స్కీం కింద పంపించేందుకు సైతం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది అన్యమత ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TTD | ఏఐ టెక్నాలజీతో దర్శనం

తిరుమల (Tirumala)లో ఏఐ టెక్నాలజీ (AI Technology) ద్వారా భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం కల్పిస్తామని బీఆర్​ నాయుడు అన్నారు. భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో నిత్య అన్నదానం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల విషయంలో సైబర్‌ మోసాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాటిని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వీఐపీ దర్శనాలు ఉదయం 8 నుంచి 8.30గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

TTD | తీర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం

రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నట్లు టీటీడీ ఛైర్మన్​ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు (Srivari Temples) నిర్మిస్తామన్నారు. దేశంలో ఇప్పటికే 320 గుళ్లు కట్టామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామన్నారు.

TTD | జగన్‌, భారతి ప్రసాదాలు తింటారా?

తిరుమలకు వచ్చి వైఎస్​ జగన్‌ (YS Jagan), ఆయన భార్య భారతి ప్రసాదాలు తింటారా అని బీఆర్​ నాయుడు ప్రశ్నించారు. ప్రసాదాలు తినరని, పటువస్త్రాలు సమర్పించరని ఆరోపించారు. వారు కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి మాట్లాడాలని సవాల్​ విసిరారు. తాము తిరుమల అభివృద్ధికి చర్యలు చేపడుతుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.