అక్షరటుడే, వెబ్‌డెస్క్:Trump Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తారో తెలియడం లేదు. భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంటున్న దశలో మరో బాంబ్ పేల్చాడు. శుక్రవారం పెన్సిల్వేనియాలోని ఉక్కు కార్మికులతో మాట్లాడిన ట్రంప్.. స్థానిక పరిశ్రమను కాపాడుకోవడానికి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను పెంచుతానని హామీ ఇచ్చారు. దీని ప్రకారం భారత్(India)నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంలపై డబుల్ టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 శాతం టారిఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అదనంగా మరో 25 శాతం సుంకాన్ని విధించడానికి సిద్ధమయ్యాడు. ఇది బుధవారం నుంచి అమలులోకి రానుంది. ట్రంప్ చర్యతో మన మెటల్ స్టాక్స్(Metal stocks) తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ప్రధానంగా సోమవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్(JSW Steel), టాటా స్టీల్(Tata Steel), జిందాల్ స్టీల్ అండ్‌పవర్, హిందాల్కో, వేదాంత, సెయిల్ వంటి స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో ఆయా స్టాక్స్ మూడు శాతం వరకు పడిపోయినా.. తర్వాత కోలుకున్నాయి. చివరికి సెయిల్ ఒక శాతానికిపైగా లాభాలతో ముగియగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.48 శాతం, టాటా స్టీల్ 1.23 శాతం, వేదాంత 0.72 శాతం నష్టాలతో ముగిశాయి.
Trump Tariff | అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల యోచన
ప్రస్తుతం భారతీయ ఉక్కు కంపెనీలకు ప్రధాన వినియోగదారుగా అమెరికా(America) ఉంది. ఇక్కడినుంచి యూఎస్‌కు రూ. 40 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. కాగా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా మన దేశం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆ దేశానికి చెందిన కొన్ని వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామన్న విషయాన్ని గతనెలలో ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలిపింది. భారత్‌నుంచి స్టీల్, అల్యూమినియం(Aluminum) దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్స్‌కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ డబ్ల్యూటీవో(WTO) ద్వారా యూఎస్‌కు నోటీస్ పంపింది. అయితే ఈ నోటీస్‌ను అమెరికా తిరస్కరించింది. బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణగా నోటీస్ లేదని పేర్కొంది. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను సమర్థించుకుంటూ.. భారత్ పేర్కొన్నట్లుగా ఇది భద్రత చర్య కాదని, జాతీయ భద్రత పరిగణనలపై ఆధారపడిన చర్యని పేర్కొంది. ఈ విషయంపై భారత్‌తో చర్యలు జరపబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భారత్ సైతం దీటుగా స్పందించాలని నిర్ణయించింది. దామాషా ప్రకారం అమెరికానుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఉత్పత్తులపై సుంకాలలో ఇస్తున్న రాయితీని తొలగించాలని భావిస్తోంది. ప్రధానంగా యూఎస్‌నుంచి దిగుమతి చేసుకునే బాదం, వాల్ నట్స్, పలు లోహాలపై అధిక పన్నులు ప్రతిపాదనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఎటుదారి తీస్తుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా మన ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్స్‌తో పెద్దగా ప్రభావం ఉండదని మన స్టీల్ మంత్రిత్వ శాఖ(Ministry of Steel) పేర్కొనడం గమనార్హం.