అక్షరటుడే, వెబ్‌డెస్క్ : H-1B visa | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా నిర్ణయం హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవితాల్లో కలకలం రేపింది. ఆయన ప్రకటించిన ప్రకారం, హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు (H-1B visa application fee) రూ.88 లక్షల వరకు పెంచబడింది, ఇది ప్రధానంగా కొత్త దరఖాస్తుదారులకు వర్తించనప్పటికీ, ఈ ప్రకటన తర్వాత టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు కఠినమైన సూచనలు జారీ చేశాయి.
మెటా, మైక్రోసాఫ్ట్ (Meta and Microsoft) వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు, ఇప్పటికే సెలవులపై ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లను 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని హెచ్చరించాయి. అలాగే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసా ఉద్యోగులు రెండు వారాల పాటు దేశాన్ని వదిలి వెళ్లకూడదని సూచించాయి. ఈ నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడింది.
H-1B visa | పెళ్లిళ్లు వాయిదా, కుటుంబ వేడుకలకు దూరం
ఈ మార్పులతో, భారత్‌లోని కుటుంబాలను కలిసేందుకు, వివాహం చేసుకునేందుకు వచ్చిన వారిలో చాలామంది తమ పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొందరైతే తమ ట్రిప్‌లను (Trips) పూర్తిగా రద్దు చేసుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చాన్నాళ్లకి తమ పిల్లలని చూస్తామనుకున్నామనే ఆనందంలో ఉండగా, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి.
అమెరికాలో పనిచేస్తున్న ఒక భారతీయ మహిళ సారమచ్.. తన సోషల్ మీడియా పోస్ట్‌లో తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. “జాలి లేకుండా, సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. నా తల్లి కన్నీళ్లని ఆపలేకపోయాను. ఎంతకాలానికి ఇంటికి వచ్చాను.. అయినా అలా తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది,” అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల హృదయాలను కదిలించాయి. “వేడుకలకు హాజరుకాలేకపోయాం.. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాం,” అని ఆమె చెప్పారు.
అయితే ఈ ఆందోళనల మధ్య, వైట్ హౌస్ (White house) ప్రెస్ సెక్రెటరీ కారోలిన్ లెవిట్ చేసిన ప్రకటన కొందరికి ఉపశమనం కలిగించింది. ఆమె పేర్కొన్న ప్రకారం, ట్రంప్ విధించిన కొత్త ఫీజు కేవలం కొత్త హెచ్-1బీ దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే వీసా ఉన్నవారు సాధారణంగా తమ ప్రయాణాలు కొనసాగించవచ్చని తెలిపారు. కానీ ఆమె ప్రకటన వెలువడేలోపు అనేక మంది తమ ఇండియా ట్రిప్‌లను రద్దు చేసుకుని, పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ పరిణామాలు తాత్కాలికమైనవే అయినా, ఉద్యోగుల మనోస్థితిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముంది. టెక్ కంపెనీలు భద్రతా చర్యల పేరుతో ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయా? లేక నిజంగా విధాన మార్పుల వల్ల సంభవించే అనర్థాలను నివారించేందుకా? అన్న చర్చలు సోషల్ మీడియాలో మరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసా హోల్డర్లకు ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌లలో ఫార్వర్డ్ మెసేజ్‌లు, అవాస్తవ ప్రచారాలు భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.