అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump warning to Canada | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు వార్నింగ్ ఇచ్చారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడా నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై వందశాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రధానమంత్రి మార్క్ కార్నీ.. చైనా వస్తువులను అమెరికా మార్కెట్లోకి సరఫరా చేయడానికి కెనడాను కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుందని హెచ్చరించారు. కెనడాను చైనా పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేస్తుందన్నారు. ఆ దేశ వ్యాపారాలు, సామాజిక వ్యవస్థ, ప్రజల జీవనశైలి అంతా ధ్వంసమవుతాయంటూ హెచ్చరించారు.
Trump warning to Canada | గోల్డెన్ డోమ్ వివాదం ఉద్రిక్తతలకు కారణం!
గ్రీన్‌ల్యాండ్ ప్రాంతంపై అమెరికా ప్రతిపాదిత ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థను కెనడా తిరస్కరించిన నేపథ్యంలో వెలువడినట్లు తెలుస్తోంది. అమెరికా మద్దతు ఉన్న ఈ భద్రతా వ్యవస్థను పక్కన పెట్టి చైనాతో సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఈ రక్షణ వ్యవస్థ కెనడాను సైతం కాపాడుతుందని, అయినా చైనాతో వ్యాపారానికి మొగ్గు చూపడం సరికాదని విమర్శలు గుప్పించారు.
Trump warning to Canada | అమెరికా కృతజ్ఞత చూపించాలి
అమెరికా కెనడాకు భద్రతా రంగంలో ఇస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చూపించాలని.. కానీ అలాంటి గుర్తింపు లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “కెనడా అమెరికా మద్దతు వల్లనే బతికి బట్టకట్టింది. ఈ విషయాన్ని కార్నీ ఎప్పటికీ మరచిపోకూడదు” అని ఆయన పేర్కొన్నారు.
చైనాతో కెనడా కొత్త వాణిజ్య ఒప్పందం
కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చైనాతో జనవరి 17న కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా కెనడా వ్యాపారవేత్తలు, కార్మికులకు 7 బిలియన్ డాలర్లకు మించిన ఎగుమతి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో భాంగంగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా సుంకాలు తగ్గించింది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై కెనడా సుంకాలు తగ్గినట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఇలా స్పందించారు.