అక్షరటుడే, వెబ్డెస్క్ : Doanld Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నవంబర్లో ఇండియాకు పర్యటనకు రానున్నారు. క్వాడ్ సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గియో గోర్(US Ambassador Sergio Gore) వెల్లడించారు.
క్వాడ్ నేతలను కలవడానికి ట్రంప్ ఎదురు చూస్తున్నారని చెప్పారు. 50 శాతం సుంకాలు విధించడంతో భారత్, అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ఇండియాపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. అయితే, షాంఘై సదస్సు తర్వాత అమెరికా వ్యవహార శైలిలో పూర్తి మార్పు వచ్చింది. ఇండియాతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించింది. భారత్ తమకు అత్యంత సన్నిహిత భాగస్వామి అని, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని ట్రంప్ ఇప్పటికే తెలిపారు. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలో ఆయన ఇండియా పర్యటనకు వస్తారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
Doanld Trump | అమెరికాకు చాలా ముఖ్యం..
ఈ ఏడాది చివర్లో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని, భారతదేశ రాయబారిగా నామినీ అయిన సెర్గియో గోర్ తెలిపారు. సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ట్రంప్ క్వాడ్ నాయకులను కలవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని, ఇండియా పర్యటన గురించి చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. తదుపరి క్వాడ్ సమావేశం(Quad Meeting) కోసం పర్యటనపై ఇప్పటికే చర్చలు జరిగాయనివెల్లడించారు. అయితే, నిర్దిష్ట తేదీలను చెప్పడానికి నిరాకరించిన ఆయన.. క్వాడ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇది అమెరికాకు చాలా ముఖ్యమైనదని తెలిపారు.
Doanld Trump | ఇద్దరు మంచి స్నేహితులు
వాణిజ్య సంబంధాల విషయంలో ఇండియాతో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ట్రంప్, మోదీ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. “మా అధ్యక్షుడు (ట్రంప్) మోడీతో లోతైన స్నేహాన్ని కలిగి ఉన్నారు. అది ప్రత్యేకమైన విషయం” అని ఆయన సెనేట్ కమిటీకి చెప్పారు. “అధ్యక్షుడు భారతదేశాన్ని విమర్శనాత్మకంగా చూశారు, కానీ ఆయన మోదీ(PM Modi)ని ప్రశంసించడానికి చాలా ప్రయత్నించారు. వారి మధ్య అద్భుతమైన సంబంధం ఉందని” అని ఆయన అన్నారు.
Doanld Trump | నవంబర్లో క్వాడ్ సదస్సు..
ఈ ఏడాది నవంబర్లో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కోసం భారతదేశాన్ని సందర్శించే ప్రణాళికలను ట్రంప్ విరమించుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, దాన్ని కొట్టిపడేస్తూ గోర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఇండియా(India)కు రావాలని ప్రధాని మోదీ జూన్ 17న జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ద్వారా ఆహ్వానించారు. అప్పట్లో ఆయన వస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అమెరికా సుంకాలు విధించడం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసింది. అయితే, ఇండియా, అమెరికా సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు రెండు దేశాల నాయకత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోక్వాడ్ సమ్మిట్ షెడ్యూల్ గురించి ప్రధాని మోదీ, ట్రంప్ ఇద్దరూ త్వరలో ఫోన్లో మాట్లాడుకునే అవకాశముందని భావిస్తున్నారు.