అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో భేటీ కానున్నారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia–Ukraine War) ప్రారంభం అయ్యాక రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తాను అధికారంలోకి రాగానే యుద్ధాన్ని ఆపుతానని గతంలో ట్రంప్ ప్రకటించారు. అయితే రష్యాతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రష్యా–ఉక్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 15న అలాస్కాలో పుతిన్‌ను కలుస్తానని తెలిపారు.
ట్రంప్ ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు (Tariffs) విధించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో అమెరికా భారత్‌పై టారిఫ్‌లు విధించింది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఖండించిన భారత్.. రష్యాతో సంబంధాలను మరింత మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించింది.
ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ (PM Modi) రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది చివరలో పుతిన్ భారత్‌కు వస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా పుతిన్‌తో ట్రంప్ భేటీ కావాలని నిర్ణయించడం గమనార్హం.
Donald Trump | 2015లో చివరిసారిగా..
పుతిన్ 2015లో చివరిసారి అమెరికాలో పర్యటించారు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశం కోసం వెళ్లారు. అనంతరం ఆయన అమెరికాలో పర్యటించలేదు. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం ఉక్రెయిన్‌కు అండగా నిలవడంతో రష్యాతో సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలో తాజాగా రెండు దేశాల అధ్యక్షులు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్స్ గురించి కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భూభాగ మార్పిడులు ఉండవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల అధినేతలు ఉక్రెయిన్ సంక్షోభానికి దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి ఎంపికలను చర్చించడంపై దృష్టి పెడతారని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ పేర్కొన్నారు.
