అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై భారీగా సుంకాలు విధించేందుకు సిద్ధం అయ్యారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందనే కారణంతో 500 శాతం టారిఫ్‌లు వేయాలని యోచిస్తున్నారు.
రష్యా పెట్రోలియం (Russia Petroleum) ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలపై భారీ సుంకాలను అనుమతించే కొత్త బిల్లును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. దీని ప్రకారం ఆయా దేశాలపై 500 శాతం సుంకాలు విధించే ప్రమాదం ఉంది. ద్వైపాక్షిక ఆమోదం కోసం వెళ్తున్న ఈ బిల్లు చౌకగా రష్యన్ చమురును కొనుగోలు చేసే దేశాలను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య భారతదేశ ఇంధన దిగుమతులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. వాషింగ్టన్‌తో భారత వాణిజ్య సంబంధాలను మరింత క్షీణించే అవకాశం ఉంది.
Trump Tariffs | మూడు దేశాలపై ప్రభావం
చౌకైన రష్యన్ చమురును కొనుగోలు చేసే దేశాలను శిక్షించడానికి ఈ బిల్లు తీసుకొచ్చినట్లు అమెరికన్ ప్రతినిధులు తెలిపారు. దీని ప్రభావం చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ఎక్కువగా పడనుంది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పుతిన్ (Putin) దాడులను ఆపడానికి ఈ బిల్లు దోహదం చేస్తుందని అగ్రరాజ్యం చెబుతోంది. కాగా అమెరికా భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాలు విధిస్తోంది. ఇందులో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు 25 శాతం టారిఫ్‌లు అమలు చేస్తోంది. వాటిని తగ్గించాలని ఓ వైపు భారత్ కోరుతోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సుంకాలు మరింత పెంచే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలపడం గమనార్హం.