అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఆ దేశస్తుల జేబులకు చిల్లు పడుతోంది. ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టాక పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు దేశాలపై భారీగా సుంకాలు(Heavy Tariffs) విధించారు.
అయితే సుంకాల పెంపుతో అమెరికా(America)కు ఆయా దేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా అమెరికన్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై మొదట 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్.. తర్వాత మరో 25 శాతం పెంచారు. ఇందులో 25 శాతం సుంకాలు ఇప్పటికే అమలులోకి రాగా.. మరో 25 శాతం ఈ నెల 27 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలపై సైతం అమెరికా భారీగా టారిఫ్‌లు పెంచింది. దీంతో ఆ దేశంలో నిత్యావసర సరుకుల నుంచి మొదలు పెడితే.. వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో ఇప్పటికే బట్టలు, బ్యాగులు తదితర వస్తువుల ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత ధరలు పెరగనున్నాయి. దీంతో ఒక్కో అమెరికన్ కుటుంబంపై ఏడాదికి రూ.2.11 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా.
Trump Tariffs | ధరలు పెంచిన కంపెనీలు
అమెరికాలో ఆగస్టు 7 నుంచి పెరిగిన సుంకాలు అమలులోకి రావడంతో షాపింగ్ మాళ్లలో ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలను పెంచేశారు. అమెరికా భారత్ నుంచి ఎక్కువగా స్కిన్ కేర్, ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. దీంతో వాటి ధరలు పెరిగాయి. అమెజాన్(Amazon), వాల్‌మార్ట్(Walmart) లాంటి షాపింగ్ మాళ్లలో పెరిగిన ధరలు అమలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
Trump Tariffs | షాపింగ్‌మాళ్లకు పరుగు
ట్రంప్ తీరుతో అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సుంకాలు పెంచుతారనే వార్తల నేపథ్యంలో షాపింగ్ మాళ్లకు (Shopping Malls) పరుగులు తీస్తున్నారు. ముందుగా వస్తువులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో సామగ్రి కొనుగోలు చేసి బై నౌ.. పే లేటర్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. దీంతో ధరలు పెరిగినా తమపై ప్రభావం ఉండకుండా చూసుకుంటున్నారు. సుంకాల విధింపుతో ఇప్పటికే ఆయా దేశాల నుంచి ఉత్పత్తులను పలు సంస్థలు తగ్గించుకున్నట్లు తెలిసింది.
