HomeUncategorizedNobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

Nobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nobel Prize | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(Donald Trump)​ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. విదేశీ విద్యార్థుల విషయంతో ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఇరాన్​పై బాంబుల వర్షం కురిపించారు. అయినా కూడా ట్రంప్​ తనకు నోబెల్​ శాంతి బహుమతి(Nobel Prize) కావాలని కోరుకుంటున్నారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి నోబెల్​ బహుమతులు అందిస్తారు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాంతి కోసం కృషి చేసిన వారికి నోబెల్​ శాంతి బహుమతి అందిస్తారు. దేశాల మధ్య శాంతి కోసం కృషి చేసిన వారికి, సమాజంలో అసమానతలు తగ్గించిన వారికి దీనిని ఇస్తారు. ఈ క్రమంలో ట్రంప్​ సైతం నోబెల్​ బహుమతి కావాలని కోరుకుంటున్నారు.

Nobel Prize | అమెరికా చట్ట సభ్యుడి ప్రతిపాదన

డోనాల్డ్​ ట్రంప్​కు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని ఇటీవల పాకిస్తాన్(Pakistan)​ కోరిన విషయం తెలిసిందే. భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గించానని గతంలో ట్రంప్​ చెప్పుకున్నారు. ఈ క్రమంలో పాక్​ ఆయనకు శాంతి బహుమతి ఇవ్వాలని నామినేట్​ చేసింది. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్​(Buddy Carter) ట్రంప్​ నోబెల్​ ఇవ్వాలని నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు.

Nobel Prize | యుద్ధాన్ని ఆపారు..

ఇజ్రాయెల్​–ఇరాన్​ మధ్య ఇటీవల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్​ ఆపరేషన్​ రైజింగ్​ లయన్(Operation Rising Lion)​ పేరిట ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్​ సైతం ఇజ్రాయెల్​పై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగింది. ఈ యుద్ధంలోకి సడన్​గా ఎంట్రీ ఇచ్చిన అమెరికా బంకర్​ బస్టర్​ బాంబులతో ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులు చేసింది. అనంతరం ఇరాన్​ – ఇజ్రాయెల్​ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్​ ప్రకటించారు. దీంతో 12 రోజుల యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని కార్టర్​ కోరారు.

Nobel Prize | నాకు నోబెల్​ రాదు

తాను ఏం చేసినా నోబెల్​ ప్రైజ్​ రాదని ట్రంప్​ ఇటీవల నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్​–పాక్​ యుద్ధం ఆపినా.. సెర్బియా – కొసావో మధ్య పోరాటాన్ని ఆపినా తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్​పై బాంబులతో దాడులు చేసినా ట్రంప్​కు నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలనడంపై పలువురు మండిపడుతున్నారు.

Nobel Prize | గతంలో ఎవరికి వచ్చిందంటే..

గతంలో మార్టిన్ లూథర్ కింగ్, ఎలిహు రూట్, థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్, హెన్రి లా ఫోంటైన్, మిఖాయిల్ గోర్బచేవ్, ఆంగ్ సాన్ సుకీ, నెల్సన్ మండేలా, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్, వంగారి మాతై, బరాక్ ఒబామా, లియు క్సియాబో తదితరులు నోబెల్​ శాంతి బహుమతి సాధించారు. 2014లో భారత్​కు కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్​కు చెందిన మలాలా సంయుక్తంగా ఈ బహుమతి గెలుపొందారు. కైలాస్​ సత్యార్థి బాలల హక్కుల కోసం ఉద్యమాలు చేశారు. అలాగే 1948లో మహత్మా గాంధీకి నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సులు అందాయి. అయితే అదే సంవత్సరం ఆయన చనిపోయారు. నోబెల్​ కమిటీ రూల్స్​ ప్రకారం చనిపోయిన వారికి బహుమతి ఇవ్వడానికి పలు కండీషన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు బహుమతి అందలేదు. ఆ ఏడాది ఎవరికి నోబెల్​ శాంతి బహుమతి ఇవ్వకపోవడం గమనార్హం.