అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ రెండు దేశాల అధ్యక్షులు సమావేశమయ్యారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , చైనా చీఫ్ జి జిన్‌పింగ్ భేటీ అయ్యారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో చైనాకు ఊరట కల్పిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా వస్తువులపై సుంకాలను 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో (China President Xi Jinping) అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. చర్చల తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. వాణిజ్య సహకారంపై రెండు వైపులా అనేక ముఖ్యమైన అవగాహనలకు వచ్చినట్లు తెలిపారు.
Trump Tariffs | కీలకాంశాలపై చర్చ..
బుసాన్‌లో జింగ్‌పింగ్‌తో రెండు గంటలకు పైగా జరిగిన అంతర్గత సమావేశంలో అనేక కీలక అంశాలపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించారు. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ చాలా నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటించారు. చాలా ముఖ్యమైన విషయాలపై తీర్మానాలు త్వరలో ప్రకటించబడతాయన్నారు. “ప్రతిదీ చర్చించబడిందని నేను చెప్పను” అని ట్రంప్ విలేకరులతో అన్నారు. “కానీ ఇది అద్భుతమైన సమావేశం. ఫెంటానిల్‌ను ఆపడానికి అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సోయాబీన్ కొనుగోళ్లు వెంటనే ప్రారంభమవుతాయి. చైనాపై సుంకాలను (Tariffs) 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గించడానికి అంగీకరించాం” అని చెప్పారు.
Trump Tariffs | అరుదైన ఖనిజాలపై ఒప్పందం
ఇరు దేశాల అధ్యక్షుల భేటీలో అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. అందులో భాగంగానే అరుదైన భూ ఖనిజాలను అమెరికాకు (America) ఎగుమతి చేసే విషయంపై అవగాహన కుదిరింది. ముఖ్యమైన పరికరాల తయారీలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వాహనాలు, రక్షణ పరికరాలకు సంబంధించింది. అన్ని అరుదైన ఖనిజాల ఎగుమతులకు సంబంధించిన సమస్య పరిష్కరించబడిందని ట్రంప్ అన్నారు. అమెరికాకు చైనా ఎగుమతులను ప్రభావితం చేసే ఎటువంటి అడ్డంకులు ఇకపై ఉండవని పేర్కొన్నారు. ఇటీవలి నెలల్లో అమెరికన్ టెక్నాలజీ, రక్షణ సంస్థలను ఇబ్బంది పెట్టిన సరఫరా గొలుసు ఆందోళనలను తాజా ఒప్పందం తగ్గించే అవకాశం ఉంది.
Trump Tariffs | ఘర్షణలు సహజమే..
ఆరు సంవత్సరాల తర్వాత ట్రంప్, జి దక్షిణ కొరియాలోని (South Korea) బుసాన్‌లో కలిశారు. ట్రంప్ జి జిన్‌పింగ్‌ను కఠినమైన సంధానకర్తగా అభివర్ణించారు. వాణిజ్యం, సుంకాలపై చర్చల సందర్భంగా “అద్భుతమైన ఒప్పందం” కోసం తాను ఆశిస్తున్నానని చెప్పారు. చైనా అధ్యక్షుడు కూడా ఇదే విధమైన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఘర్షణను కలిగి ఉండడం సాధారణమేనని, అయితే చైనా, యునైటెడ్ స్టేట్స్ స్థిరమైన పునాదిని నిర్మించుకోవాలని, ఒకరి పురోగతికి మరొకరు మద్దతు ఇవ్వాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు.

