అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | ట్రంప్ సుంకాల భయంతో ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సైతం ఒత్తిడికి గురవుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 479 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పాటు చైనా, బ్రెజిల్‌లను లక్ష్యంగా చేసుకుని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కొత్త బిల్ తీసుకువస్తున్నారు. సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ వచ్చేవారంలో అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సెనేటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఈ చట్టం ప్రకారం రష్యానుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు ఉంటుంది. దీంతో ఎగుమతులు తగ్గి మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతున్నారు.గురువారం ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా 187 పాయింట్లు పెరిగి లాభాల బాటపడుతున్నట్లు కనిపించింది. అయితే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగి 525 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 27 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 179 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 84,481 వద్ద, నిఫ్టీ (Nifty) 181 పాయింట్ల నష్టంతో 25,959 వద్ద ఉన్నాయి.
అన్ని రంగాల్లో సెల్లాఫ్..
అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 3.01 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.25 శాతం, కమోడిటీ 1.99 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.85 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.42 శాతం, ఐటీ ఇండెక్స్ 1.35 శాతం, పీఎస్‌యూ 1.30 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.29 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 1.17 శాతం, అదాని పోర్ట్స్ 0.95 శాతం, హెచ్‌యూఎల్ 0.65 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.55 శాతం, ఎటర్నల్ 0.52 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సెన్సెక్స్‌లో టీసీఎస్ 2.37 శాతం, టాటా స్టీల్ 1.88 శాతం, టెక్ మహీంద్రా 1.70 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.87 శాతం, రిలయన్స్ 1.50 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.38 శాతం నష్టాలతో ఉన్నాయి.