అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump).. ప్రధాని నరేంద్ర మోదీని ఈజిప్టుకు రావాలని ఆహ్వానించారు. ఈజిప్టులోని షర్మెల్ షేక్‌లో సోమవారం గాజా ఒప్పందం జరుగనుంది. ఈ శాంతి సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ఆహ్వానం అందింది.
శాంతి ఒప్పందానికి గడువు సమీపిస్తున్న చివరి గంటల్లో అనూహ్యంగా ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయించారు. గాజా (Gaza) స్ట్రిప్‌లో కొనసాగుతున్న సంఘర్షణలను నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరవుతారా.. లేదా? అన్న దానిపై ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
PM Modi | 20 దేశాల అధ్యక్షుల సమక్షంలో..
ట్రంప్, సీసీ సంయుక్త అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 20 దేశాలకు చెందిన నాయకుల భాగస్వామ్యంతో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం (Egypt presidential office) అధికారిక ప్రకటనలో పేర్కొంది. గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడానికి, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, మధ్యప్రాచ్యంలో భద్రత కోసం కొత్త అధ్యాయాన్ని తెరవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ప్రయత్నిస్తుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలను అంతం చేయడానికి ట్రంప్ అవిశ్రాంత తపనను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
PM Modi | ప్రధాని నిర్ణయంపై ఉత్కంఠ..
అమెరికా (Egypt), ఈజిప్టు ఆహ్వానాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా? శాంతి ఒప్పందం కార్యక్రమానికి హాజరవుతారా? అన్న దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరైతే అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న భావన నెలకొంది. సుంకాల కారణంగా ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు (India-US relations) దిగజారాయి.
వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబనకు తెరదించే ప్రయత్నాలు ఊపందుకుంటాయన్న భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో పాలస్తీనా లక్ష్యానికి ఇండియా మద్దతు ఇవ్వడంతో పాటు ఈజిప్టుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.