అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) భారత్‌పై మరోసారి భారీ సుంకాలు విధించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా మరో 25శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై మొత్తం టారిఫ్‌లు 50 శాతానికి చేరాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం (25% Tarifs) విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై బుధవారం సంతకం చేశారు. రష్యా (Russia) చమురు కొనుగోలుకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia–Ukraine war) విషయంలో భారత్ తటస్థంగా ఉంది. అయితే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. దీంతో అమెరికా భారత్‌పై కొంతకాలంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపాలని ఒత్తిడి చేసింది. అయితే అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. ఆయిల్ ఎక్కడి నుంచి కొనాలనేది తమ ఇష్టమని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ఇటీవల 25శాతం టారిఫ్స్ విధించారు.
Trump Tariffs | వెనక్కి తగ్గకపోవడంతో..
ట్రంప్ సుంకాలు విధించినా భారత్ వెనక్కి తగ్గకపోగా.. రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajith Doval) రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. “ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14066 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, రష్యన్ ఫెడరేషన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొనుగోలు చేస్తున్న భారతదేశంపై అదనపు సుంకాలు విధించడం అవసరమే. టారిఫ్ పెంపు నిర్ణయం సముచితమేనని ” ట్రంప్ తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు.
Trump Tariffs | ముందే చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంపై విధించిన సుంకాలను (Tariffs) గణనీయంగా పెంచుతానని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదన్నారు. ‘‘వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు, కానీ మేము తక్కువ వ్యాపారం చేస్తామని” చెప్పారు. అందుకే సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. కాగా గతంలో విధించిన 25శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచి అమలులోకి రానున్నాయి.
Trump Tariffs | పలు రంగాలపై ప్రభావం
ట్రంప్ నిర్ణయం భారతదేశం-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని, ఔషధాలు, వస్త్రాలు మరియు యంత్రాలు వంటి రంగాలను భారీగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. తాజాగా విధించిన 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, రష్యన్ సైనిక పరికరాలు. ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల భారతదేశం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ చెప్పిన “జరిమానా” గురించి కార్యనిర్వాహక ఉత్తర్వులో ప్రస్తావించలేదు. అయితే అమెరికా చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.