అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టిన తర్వాత పలు దేశాలపై టారిఫ్స్ (Tariffs) విధించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వాటిని 90 రోజుల పాటు వాయిదా వేశారు. పలు దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. అయితే భారత్‌తో ఇంకా ఒప్పందం ఖరారు కాకపోవడంతో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Trump Tariffs | ఆగస్టు 1 నుంచి అమలులోకి..
భారత్‌పై పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. భారత్ తమకు మిత్రదేశమే కానీ అక్కడ టారిఫ్‌లు ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. దీంతో తాము కూడా టారిఫ్‌లు విధిస్తున్నట్లు చెప్పారు. సుంకాలతో పాటు పెనాల్టీ ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. భారత్‌తో తాము చాలా తక్కువ వ్యాపారం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో సుంకాలు చాలా ఎక్కువగా ఉండడమే అందుకు కారణమన్నారు.
Trump Tariffs | ఆ అక్కసుతోనేనా..
రష్యా–ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అంతేగాకుండా యుద్ధం నేపథ్యంలో నాటో దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని ఆపేశాయి. అయితే రష్యా తక్కువ ధరకు ముడి చమును ఆఫర్ చేయడంతో భారత్ కొనుగోలు చేస్తోంది. అంతేగాకుండా పలు ఆయుధాలను కూడా భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ (Russia Oil) దిగుమతి ఆపాలని అమెరికా భారత్‌కు సూచించింది. అయితే భారత్ అందుకు నిరాకరించింది. తమకు ఎక్కడ తక్కువకు లభిస్తే అక్కడ కొనుక్కుంటామని స్పష్టం చేసింది. ఈ అక్కసుతోనే ట్రంప్ తాజాగా భారత్‌పై సుంకాలు విధించారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని, చమురు కొంటుందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలని అన్ని దేశాలు అంటే భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయన్న ఆయన పోస్ట్ చేశారు.
Trump Tariffs | పొడిగింపులు లేవు
ఇతర దేశాలకు సైతం ట్రంప్ పరస్పర సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. లక్ష్యంగా చేసుకున్న దేశాలకు సుంకాలు అమల్లోకి వస్తాయని, ఈ సారి ఎలాంటి పొడిగింపులు ఉండవని ఆయన ప్రకటించారు.
Trump Tariffs | పలు రంగాలపై ప్రభావం
భారత్ నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ టారిఫ్స్ విధించడంతో అక్కడ వాటి రేట్లు పెరగనున్నాయి. దీంతో కొనుగోళ్లు తగ్గి భారత్‌పై ప్రభావం పడనుంది.
Trump Tariffs | సుంకాల ఎఫెక్ట్ తాత్కాలికమేనా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన సందర్భంగా వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే కొన్ని కారణాలతో రెండు దేశాలు ఒప్పందాన్ని చేసుకోలేకపోయాయి. ఇరు దేశాల అధికారుల మధ్య ఇప్పటికే ఐదు దశల చర్చలు జరిగాయి. ఆగస్టు చివరలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే సుంకాల బాధ తప్పనుంది.