HomeUncategorizedDonald Trump | వెనక్కి తగ్గిన ట్రంప్​.. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ పోస్ట్

Donald Trump | వెనక్కి తగ్గిన ట్రంప్​.. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ పోస్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గారు. దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చారు.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్​ అక్రమ వలసపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా(America)లో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలంటూ ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించారు. అయితే తాజాగా ట్రంప్​ విదేశీ ఉద్యోగులను కూడా ఆయా కంపెనీలు నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అగ్రరాజ్యంలో పెట్టుబడులపై ఆలోచిస్తామని దక్షిణ కొరియా హెచ్చరించడంతో ట్రంప్​ దిగొచ్చారు. విదేశీ ఉద్యోగులకు(Foreign Employees) ఆహ్వానం అంటూ పోస్ట్​ పెట్టారు.

Donald Trump | అసలు ఏం జరిగిందంటే?

అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిపై ట్రంప్​(Donald Trump)ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించేందుకు పోలీసులు దాడులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జార్జియాలోని హ్యుందాయ్​ ప్లాంట్​లో అధికారులు దాడులు చేశారు. ఇందులో సుమారు 475 మంది అక్రమ వలసదారులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఎక్కువ మంది దక్షిణ కొరియాకు చెందిన వారు. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు దక్షిణ కొరియన్లు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత, మాన్యువల్ లేబర్ చేయడానికి అనుమతించని పర్మిట్‌లను కలిగి ఉన్నారని ఆరోపించారు. ఆ సమయంలో కార్మికులను గొలుసులతో బంధించి, చేతికి సంకెళ్లు వేసిన చిత్రాలు దక్షిణ కొరియాలో విస్తృత ఆందోళన కలిగించాయి.

Donald Trump | దక్షిణ కొరియా ఆగ్రహం

తమ దేశ కార్మికులపై అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. దీంతో ట్రంప్​ వెనక్కి తగ్గారు. విదేశీ సంస్థలు ఇతర దేశాల కార్మికులను అమెరికాకు తెచ్చుకోవచ్చని అన్నారు.

Donald Trump | వారి నుంచి నేర్చుకోవడానికి..

విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయని ట్రంప్​ అన్నారు. ఆ సమయంలో వారికి అవసరం ఉన్న ఉద్యోగులను ఇతర దేశాల నుంచి అవి తెచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చిప్స్, సెమీ కండక్టర్స్, కంప్యూటర్లు, ఓడలు, రైళ్లు మరియు అనేక ఇతర ఉత్పత్తులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఆయన అమెరికన్లకు సూచించారు. ఇతర దేశాల నిపుణుల దగ్గర నుంచి వాటిని నేర్చుకోవాలన్నారు. అలా నేర్పించడానికి ఉద్యోగులు అవసరం అని పేర్కొన్నారు. “మేము వారిని స్వాగతిస్తాం, వారి ఉద్యోగులను స్వాగతిస్తాం.. వారి నుంచి నేర్చుకుంటామని” ట్రంప్​ పోస్ట్​ చేశారు.