అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump Global Tariff | అమెరికా సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై విదేశీ శక్తుల ఒత్తిడి ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ట్రంప్ పలు దేశాలపై సుంకాలు (Tariffs) విధించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రపంచంలోని పలు దేశాలపై విధించిన సుంకాలు (పన్నులు) చెల్లవని స్పష్టం చేసింది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇది అధ్యక్షుడు తన అధికారు పరిధిని దాటినట్లే అని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది. దీంతో ట్రంప్ న్యాయమూర్తులపై మండిపడ్డారు. అంతేగాకుండా అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10శాతం సుంకం విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశానని తెలిపారు.
Trump Global Tariff | ఫిబ్రవరి 24 నుంచి..
సుప్రీంకోర్టు దిగుమతి సుంకాలను తొలగించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై గ్లోబల్ 10శాతం సుంకంపై సంతకం చేయడం చేశానని, ఇది వెంటనే అమలులోకి వస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కొత్త సుంకాలు ఫిబ్రవరి 24న ఉదయం 10:31 గంటల (భారత కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి రానున్నాయి. US తన చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న పరస్పర వాణిజ్య ఒప్పందాలను కొనసాగిస్తుందని, దాని వాణిజ్య భాగస్వాములు అదే స్థాయి నిబద్ధతను చూపించాలని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Trump Global Tariff | వెనక్కి తగ్గను
సెక్షన్ 122 కింద 10 శాతం ప్రపంచ సుంకాన్ని విధించే ఉత్తర్వుపై సంతకం చేశానని, ఇది ఇప్పటికే వసూలు చేస్తున్న సాధారణ సుంకాలకు మించి ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. తాను చాలా ఎక్కువ వసూలు చేయగలనని పేర్కొన్నారు. అవసరమైతే వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరించారు. యూఎస్ సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికే అవమానకరం అని పేర్కొన్నారు. ఆ జడ్జిలని చూసి సిగ్గుపడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.