Kaleshwaram Project
Acb Raids | నీటిపారుద‌ల శాఖ‌లో క‌ల‌క‌లం.. ఏసీబీ అదుపులో ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Acb Raids | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీగా దండుకున్న అధికారుల చిట్టా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతోంది. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల వ‌రుస అరెస్టుల‌తో నీటిపారుద‌ల శాఖ‌లో క‌ల‌క‌లం రేగుతోంది. ఇప్ప‌టికే కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ప‌ని చేసిన నూనె శ్రీ‌ధ‌ర్‌ లాంటి భారీ అవినీతి తిమింగ‌లాల ఆట క‌ట్టించిన అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) తాజాగా మ‌రో కీల‌క వ్య‌క్తిని అదుపులోకి తీసుకుంది.

అప్ప‌ట్లో ఇరిగేష‌న్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా ప‌ని చేసిన ముర‌ళీధ‌ర్ రావు(Muralidhar Rao)ను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని పేర్కొంటూ ఆయ‌న‌తో పాటు ఆయ‌న బంధువుల ఇండ్ల‌లో ఏక‌కాలంలో సోదాలు చేసింది. హైద‌రాబాద్‌, క‌రీనంగ‌ర్‌, జ‌హీరాబాద్‌ల‌లో 10 చోట్ల త‌నిఖీలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో అక్ర‌మంగా సంపాదించిన ఆస్తులు భారీగానే వెలుగు చూసిన‌ట్లు తెలిసింది.

Acb Raids | విచ్చ‌ల‌విడి దోపిడీ..

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం(BRS Government) ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై మొద‌టి నుంచే భారీగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్రాజెక్టు నిర్మాణం పేరిట రూ.కోట్ల కొద్ది ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటున్నార‌ని బీజేపీ, కాంగ్రెస్ స‌హా ప్ర‌జా సంఘాలు, మేధావులు.. ఇలా అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

రూ.ల‌క్ష కోట్ల‌కు పైగా వెచ్చించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కం(Lift Irrigation Scheme)లో గుండెకాయ లాంటి మేడిగ‌డ్డ ప్రాజెక్టు(Medigadda Project) మూడేళ్ల‌కే కుంగింది. ఈ నేప‌థ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవ‌క‌త‌వ‌క‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. ఓ వైపు, కాళేశ్వ‌రం నిర్మాణంపై పీసీ ఘోష్ క‌మిష‌న్ స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపుతుండ‌గా, మ‌రోవైపు, అప్ప‌ట్లో భారీగా దండుకున్న ఇరిగేష‌న్ శాఖ అధికారులపై ఏసీబీ క‌న్నేసింది. రూ.కోట్ల కొద్దీ దండుకున్న ఒక్కో అధికారి బాగోతం బ‌య‌టకు తెస్తోంది.

Acb Raids | రూ.కోట్లు పోగేసిన నూనె శ్రీ‌ధ‌ర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగ‌మైన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏకంగా రూ.500 కోట్లు సంపాదించారంటేనే ఏ స్థాయిలో అవినీతిలో జ‌రిగిందో ఊహించుకోవ‌చ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గాయత్రి పంప్‌హౌస్ నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ పై దాడి చేసిన ఏసీబీ(ACB)కి.. అత‌ని ఆస్తులు చూసి మ‌తిపోయినంత ప‌నైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేయ‌గా, రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తులు వెలుగులోకి వ‌చ్చాయి. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లో కమర్షియల్ బిల్డింగ్స్, 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి, అపార్ట్‌మెంట్స్ ఉన్నట్లు తేలింది. థాయ్‌లాండ్‌లో నిర్వహించిన అత‌ని కుమారుడి పెళ్లికి అతిథుల‌ను విమానంలో త‌ర‌లించిన‌ట్లు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గాయత్రి పంప్‌హౌస్ నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకుని ఆస్తులు కూడ‌బెట్టుకున్న‌ట్లు ఏసీబీ గుర్తించింది. ప్ర‌స్తుతం అత‌ను జైలులో ఊచ‌లు లెక్క పెడుతున్నాడు.

Acb Raids | ముర‌ళీధ‌ర్‌రావు ఆట‌క‌ట్టు..

ఇక, నీటిపారుద‌ల శాఖ‌లో తిష్ట వేసి, భారీగా ఆస్తులు పోగేసిన మ‌రో అధికారి బాగోతం తాజాగా బ‌య‌ట‌కొచ్చింది. నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావును ఏసీబీ మంగ‌ళవారం అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు.. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ఆయన నివాసంపై దాడి చేసిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌తోపాటు మొత్తం పది చోట్ల మురళీధర్‌రావు బంధువులు, సన్నిహితుల ఇండ్లలో సోదాలు చేప‌ట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మురళీధర్‌ రావు ఇరిగేషన్ శాఖ(Irrigation Department)లో చక్రం తిప్పారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. కానీ, ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు.

కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక కూడా కొన‌సాగించ‌డంతో 13 ఏళ్ల పాటు ఆయ‌న ఇరిగేష‌న్ శాఖ‌లో తిష్ట వేశారు. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీల‌క‌మైన‌ మేడిగడ్డ అవినీతి, అవకతవకల్లో కూడా మురళీధర్‌ రావు కీలక పాత్ర వ‌హించారు.

Acb Raids | విజిలెన్స్ విచార‌ణ‌..

నీటిపారుద‌ల శాఖ‌లో సంవ‌త్స‌రాలుగా జ‌రుగుతున్న అవినీతి బాగోతంపై కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక ఫోక‌స్ చేసింది. ఈ క్ర‌మంలోనే విజిలెన్స్‌తో విచార‌ణ(Vigilance Investigation) జ‌రిపించి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇద్ద‌రు ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల‌పై వేటు వేసింది. ఈఎన్సీ (రామగుండం) ఎన్‌ వెంకటేశ్వర్లును ఏకంగా సర్వీస్‌ నుంచి తొలగించింది. అలాగే, ఈఎన్సీ మురళీధర్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయ‌న త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

మరోవైపు, కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ముందు మురళీధర్ రావు ఇంతకు ముందు విచారణకు హాజరయ్యారు. ఇరిగేషన్ శాఖలో జ‌రిగిన అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అనేక మందిపై కేసులు నమోదు చేసింది. విజిలెన్స్ శాఖ క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన 17 మందిలో మురళీధర్ రావు కూడా ఉన్నారు.