అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో చలితీవ్రత మళ్లీ పెరిగింది. నవంబర్ రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (temperatures) భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మధ్యలో నాలుగు రోజులు చలి తగ్గింది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు రోజుల నుంచి చలి ప్రతాపం చూపుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు చలి తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ (Ditva cyclone) కారణంగా శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సాయంత్రం నుంచి చలి పెడుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Weather Updates | కనిష్ణ ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా శీతల గాలులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు చలితీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో 7.8 డిగ్రీలు, ఆసిఫాబాద్ 8.3, ఆదిలాబాద్ 9.2, వికారాబాద్ 9.5, కామారెడ్డి 9.7, నిజామాబాద్ 10, సిరిసిల్ల 10, రంగారెడ్డిలో 10, సిద్దిపేట 10.1, మెదక్ 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం మధ్యాహ్నం శీతల గాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.