అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cold Wave | శీతాకాలం ప్రారంభంలోనే చలి వణికిస్తోంది. రాష్ట్రంలో నవంబర్1 నుంచి చలి కాలం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఏడాది నవంబర్ 5 వరకు సైతం వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత నుంచి చలి ప్రభావం మొదలైంది.
రాష్ట్రంలో సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతుంటాయి. చలి తీవ్రత ఆ సమయంలోనే అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం నవంబర్ 6 నుంచే చలి వణికిస్తోంది. ముఖ్యంగా నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సాయంత్రం ఆరు అయిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటల వరకు కూడా చలిపెడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Cold Wave | సిర్పూర్లో 7.1 డిగ్రీలు
రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో బుధవారం తెల్లవారుజామున 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. తిర్యానిలో 8.2 డిగ్రీలు నమోదు అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలిగాలులతో వణికిపోతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం దీని ప్రభావం అధికంగా ఉంది. నగరంలోని శేరిలింగంపల్లిలో 11.8, రాజేంద్రనగర్‌లో 12.9, మారేడ్‌పల్లిలో 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగు రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Cold Wave | జాగ్రత్తగా ఉండాలి
చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై రాత్రిపూట జర్నీ చేయకపోవడం ఉత్తమం. బయటకు వెళ్లాల్సి వస్తే స్వెటర్లు, క్యాప్‌లు, చేతులకు గ్లౌస్లు పెట్టుకోవాలి. చలి ప్రభావంతో జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు సైతం చలికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
