అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adilabad | మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో నేరేడుగొండ మండలం (Neredugonda Mandal) భోథ్ క్రాస్ రోడ్డు ద్గగర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు.
Adilabad | భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జేసీబీ సాయంతో లారీ, బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నా.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.