అక్షరటుడే, భీమ్‌గల్ : Panchayat Elections | ఒక్క ఓటు గ్రామ తలరాతను మారుస్తుందని నమ్మాడు.. ఉపాధి కంటే బాధ్యతే మిన్న అని చాటాడు ఓ యువకుడు. సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఉపాధి పొందుతున్న సంపత్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వదేశానికి వచ్చాడు.
Panchayat Elections | వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ..
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామానికి (Pachalanadkuda Village) చెందిన సంపత్ గౌడ్ బొమ్మకంటి ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, తన గ్రామాభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. విమాన ప్రయాణ ఖర్చులు, సెలవు ఇబ్బందులను లెక్కచేయకుండా గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
Panchayat Elections | యువతకు ఆదర్శంగా..
’ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. మనం వేసే ప్రతి ఓటూ గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉపాధి కోసం ఎక్కడ ఉన్నా.. మన మూలాలున్న గ్రామం కోసం ఓటు వేయడం ప్రతి పౌరుడి కనీస ధర్మం’ అని సంపత్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదువుకున్న యువత ఓటు విలువను గుర్తించి, పోలింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చాడు. ఓటు వేసేందుకు విదేశం నుంచి వచ్చిన సంపత్ గౌడ్‌ను గ్రామస్థులు, పలువురు నాయకులు అభినందించారు.