అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Airlines | కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకున్న దేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో క్రమంగా రికవరీ దిశగా అడుగులు వేస్తోంది. గురువారం నాటికి 1,950కి పైగా ఫ్లైట్లను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వీసుల ద్వారా సుమారు మూడు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుందని సంస్థ అధికారికంగా తెలిపింది.
అయితే డిసెంబర్ 3 నుంచి 5 వరకు వందలాది ఫ్లైట్లు రద్దు కావడంతో ఎయిర్‌పోర్టు (Airport)ల్లో చిక్కుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణికుల కష్టాలను గుర్తించిన ఇండిగో పరిహార ప్యాకేజీని ప్రకటించింది. ఆ రోజుల్లో అత్యంత ఎక్కువగా ప్రభావితమైన ప్రయాణికులకు ₹10,000 విలువ చేసే ట్రావెల్ వోచర్‌ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగో ఫ్లైట్స్ బుకింగ్ (Indigo Flight Bookings)లో ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ పరిహారం ఎవరికి లభిస్తుంది, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివరాలను మాత్రం ఇండిగో ఇంకా ప్రకటించలేదు.
స్టాక్ ఎక్స్ఛేంజ్ (Stock Exchange)లకు సమర్పించిన నివేదికలో ఇండిగో ఈ విధంగా పేర్కొంది. ‘‘మా కార్యకలాపాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా మరో 138 విమానాశ్రయాలను కలుపుతూ సేవలు అందుబాటులోకి వచ్చాయి’’ ప్రస్తుతం కొద్ది సంఖ్యలో మాత్రమే వాతావరణం, సాంకేతిక లోపాలు, నియంత్రణ సమస్యల కారణంగా ఫ్లైట్లు రద్దవుతున్నాయని సంస్థ స్పష్టం చేసింది.
గత వారం రోజులుగా రోజుకు సగటున 300కు పైగా ఫ్లైట్లు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా సీరియస్‌గా స్పందించి ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ప్రకటించిన పరిహార ప్రకటనతో పాటు త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని ఇండిగో పేర్కొంది.