అక్షరటుడే, ఇందూరు : Transport Department | రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి గురించి అందరికి తెలిసిందే. అధికారులు ఏజెంట్ల సాయంతో లారీలు, ఇతర వాహనాల డ్రైవర్ల (Drivers) నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు చేపట్టగా.. చెక్ పోస్టుల్లో (Check Posts) అధికారులు వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రవాణా శాఖ (Transport Department) చెక్‌పోస్టుల్లో అవినీతిని అంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగిస్తున్నట్లు ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Joint Nizaabad District) రవాణా శాఖ ఆధ్వర్యంలో మూడు చెక్ పోస్టులున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సాలూర, కామారెడ్డి జిల్లాలో సలాబత్పూర్, పొందుర్తిలో ఆర్టీఏ చెక్‌పోస్టులు (RTA Check posts) ఉన్నాయి. వీటిలో ఎంవీఐ, ఏఎంవీఐ, కానిస్టేబుల్ సిబ్బంది 24 గంటల పాటు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ అందే సేవలన్నీ ఇకపై ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా రవాణా శాఖ సర్వర్‌లో మార్పులు చేస్తున్నారు. దీంతో అంతర్రాష్ట్ర వాహనాలకు సంబంధించిన తాత్కాలిక అనుమతులు, వాహన పన్నులు, రవాణా శాఖ నిబంధనల పత్రాలు తనిఖీలను సాధారణ తనిఖీల మాదిరిగానే చేపట్టనున్నారు.
Transport Department | మొబైల్ స్క్వాడ్లు
చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వాహనాలను రోడ్లపై తనిఖీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఆరు నెలల పాటు మొబైల్ స్క్వాడ్లను (Mobile Squads) నియమించనుంది. ఆయా బృందాలు నూతన నిబంధనలపై అవగాహన కల్పించనున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తించేందుకు వీలుగా రహదారులపై ఆటో నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Transport Department | ఇప్పటి వరకు చెక్ పోస్టుల విధులు
ఉమ్మడి జిల్లాలోకి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక సరుకు రవాణాతో పాటు ప్రజలను తరలించే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారి (National Highways) ఉండడంతో ఆయా రాష్ట్రాల సరుకు రవాణా వాహనాలు కూడా వెళ్తుంటాయి. వీటికి చెక్‌పోస్టుల వద్ద రవాణా అధికారులు తాత్కాలిక అనుమతి (టెంపరరీ పర్మిట్) పత్రాలని జారీ చేసేవారు. సరుకు ఏముంది, లోడ్ ఎంత ఉందనే వివరాలతో పాటు పన్నులు సక్రమంగా చెల్లించాలని తనిఖీలు చేసేవారు. నిబంధనలు పాటించకుండా పట్టుపడితే కేసులు నమోదు చేసేవారు.
Transport Department | అక్రమాలకు ఆస్కారం
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల తొలగింపుతో వాహన రాకపోకల సులభతరం అవుతాయి. వస్తు రవాణా వేగవంతమై వ్యాపారులకు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వానికి చెక్ పోస్టుల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. కానీ నిషేధిత వస్తువులు, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, మద్యం రవాణా పెరిగే ప్రమాదం ఉంది. సరుకు రవాణాలో అక్రమాలకు ఆస్కారం ఉంటుంది. పన్నులు చెల్లించకపోవడం, పర్మిట్లు తీసుకోకపోవడం వంటి వాటితో ప్రభుత్వానికి గండిపడే అవకాశం ఉంటుంది.
Transport Department | అవినీతికి అడ్డుకట్ట
ఉమ్మడి జిల్లాలో రవాణా చెక్‌పోస్టుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అంతకన్నా ఎక్కువగా అక్కడ విధులు నిర్వర్తించే కొంతమంది సిబ్బంది వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఏసీబీ తనిఖీల్లోనే (ACB inspections) అనేక అక్రమాలు వెలుగు చూశాయి. చెక్‌పోస్ట్‌లో పోస్టింగ్ కోసం అధికారులు, కానిస్టేబుళ్లు ఉత్సాహం చూపుతుంటారు. ఒకరోజు విధులు నిర్వహిస్తే మరుసటి రోజు సెలవుతో పాటు మాముల్లకు కొదవ లేకుండా ఉంటుంది. చెక్‌పోస్టు సిబ్బంది వసూళ్ల దందా అంతా ప్రైవేటు సిబ్బందితోనే నడిపేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది.
Transport Department ఇకపై రహదారులపై తనిఖీలు
– ఉమామహేశ్వర్ రావు, డీటీవో
జిల్లాలోని చెక్‌పోస్టులను తొలగిస్తున్నట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. చెక్‌పోస్టుల్లో అందించే సేవలు ఇక నుంచి ఆన్లైన్లో అందిస్తాం. రోడ్లపైనే వాహనాల తనిఖీలు చేపడుతాం.