అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు జరుగతున్నా.. భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు మెదక్ ట్రాన్స్‌కో డీఈ (Medak Transco DE) మహమ్మద్ షరీఫ్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. పాపన్నపేట (Papannapet) మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేశాడు. దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు బతిమిలాడటంతో రూ.30 వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. ఇప్పటికే రూ.9 వేలు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం రూ.21 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ACB Raid | విద్యుత్ శాఖలో జోరుగా అవినీతి
విద్యుత్ శాఖలో అవినీతి జోరుగా సాగుతోంది. లైన్‌మన్ స్థాయి నుంచి డీఈల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో విద్యుత్ శాఖ అధికారులు ఎక్కువగా పట్టుబడుతుండటం గమనార్హం. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రాసెస్ చేయడానికి రూ.1,90,000 లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ, దేవాదాయ శాఖలోని ఇన్‌ఛార్జి సూపరింటెండింగ్ ఇంజినీరు వూడెపు వెంకట రామారావు బుధవారం ఏసీబీకి దొరికాడు. హైదరాబాద్ (Hyderabad) పెద్ద అంబర్‌పేట్‌లోగల సహాయక ఇంజినీరు(ఆపరేషన్స్) కార్యాలయంలోని లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్ను సైతం బుధవారం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

