అక్షరటుడే, వెబ్‌డెస్క్: Darjeeling | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడి 17 మంది మృతి చెందారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ (Darjeeling)జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కీలకమైన రోడ్డు మార్గాలు తెగిపోవడంతో పాటు కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో సిక్కింకు కనెక్టివిటీని నిలిపివేసిందని, అనేక మంది పర్యాటకులు, ప్రజలు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. మిరిక్, సుఖియా పోఖారి పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. డార్జిలింగ్‌ను సిలిగురికి, బెంగాల్‌ను సిక్కింకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు (landslides) విరిగి పడటంతో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు.
Darjeeling | పర్యాటక ప్రాంతాల మూసివేత
పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. డార్జిలింగ్ టాయ్ రైలు సేవను (toy train service) నిలిపివేశారు. టైగర్ హిల్, రాక్ గార్డెన్‌తో సహా అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (GTA) పర్యాటకులను ఇంటి లోపలే ఉండి వాతావరణ నవీకరణలను పర్యవేక్షించాలని కోరింది. దుర్గా పూజ తర్వాత కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు కొండలకు ప్రయాణించారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో చాలామంది చిక్కుకుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ.. తీవ్రమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందన్నారు.
Darjeeling | అప్రమత్తంగా ఉండాలి
అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు (Heavy Rains), ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు ఇలాగే కొనసాగితే ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు పక్కనే ఉన్న నేపాల్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ దేశంలో కూడా కొండచరియలు విరిగి పడి 14 మంది మృతి చెందారు.
Darjeeling | ప్రధాని విచారం
డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగి పడి 17 మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డార్జిలింగ్‌లో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర బాధాకరం అన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.