Homeక్రైంTrain Accident | ఉత్తరప్రదేశ్​లో విషాదం.. ప్రయాణికులను ఢీకొన్న రైలు.. ఆరుగురి మృతి

Train Accident | ఉత్తరప్రదేశ్​లో విషాదం.. ప్రయాణికులను ఢీకొన్న రైలు.. ఆరుగురి మృతి

ఉత్తర ప్రదేశ్​లోని చునార్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh)లో విషాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మీర్జాపూర్‌లోని చునార్‌ రైల్వేస్టేషన్‌ (Chunar Railway Station)లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసి (Varanasi)కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితులు ఉదయం 9.15 గంటల ప్రాంతంలో గోమో-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తప్పు వైపు నుంచి ట్రాక్‌లను దాటడానికి ప్రయత్నిస్తుండగా, ప్లాట్‌ఫామ్ నంబర్ మూడు నుంచి వెళుతున్న కల్కా మెయిల్ వారిని ఢీకొట్టింది. ప్రయాణికులు ప్లాట్‌ ఫామ్‌పై కాకుండా ట్రాక్‌ వైపు దిగి.. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Train Accident | సీఎం యోగి సంతాపం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) రైలు ప్రమాదంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ, రక్షణ చర్యలు త్వరగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి SDRF మరియు NDRF బృందాలను ఆపరేషన్‌లో సహాయం చేయాలని సూచించారు. గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

Train Accident | వరుస ఘటనలు

ఛత్తీస్​గఢ్ (Chhattisgarh)​లోని బిలాస్​పూర్​ జిల్లాలో సమీపంలో రైలు ప్రమాదం ఘటన మరువక ముందే యూపీలో ప్రమాదం జరగడం గమనార్హం. జైరాంనగర్ స్టేషన్ (Jairamnagar Station) మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొని 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు లోకో పైలట్ విద్యా సాగర్ మరణించిన వారిలో ఉన్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ రష్మి రాజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. రైల్వే అధికారులు (Railway Officers) మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు. వరుస ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.