అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kanwari Yatra | కన్వారి యాత్రలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని (Jharkhand) దేవ్‌ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది కన్వారి యాత్రికులు దుర్మరణం చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. యాత్రికులతో వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద విషయాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (BJP MP Nishikant Dubey) నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు చనిపోయారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. “శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో (Kanwar Yatra) విషాదం చోటు చేసుకుంది. నా లోక్‌సభ నియోజకవర్గం దేవ్‌ఘర్‌లో భక్తులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని బాబా బైద్యనాథ్ జీ ప్రసాదించాలి” అని Xలో పేర్కొన్నారు.
మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం (Jamunia forest area) సమీపంలో కన్వరి భక్తులతో వెళ్తున్న బస్సును గ్యాస్ సిలిండర్లతో వస్తున్న వాహనం ఢీకొట్టింది తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఐదుగురు మరణించగా, చాలా మంది గాయపడ్డారని ఇన్‌స్పెక్టర్ జనరల్ (డుమ్కా జోన్) శైలేంద్ర కుమార్ సిన్హా తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. అయితే, ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రాఫిక్ డిప్యూటీ ఎస్పీ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు పంపుతున్నామని చెప్పారు.